పాతబస్తీలో రూ. వెయ్యి కోట్లతో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు సీఎం కేసీఆర్. ప్రగతిభవన్‌లో ఎంపీ అసదుద్దీన్‌తో పాటు అధికారులతో భేటీ అయిన కేసీఆర్ పాతబస్తీ అభివృద్ధి గురించి చర్చించారు. త్వరలో పాతబస్తీలో అభివృద్ధి పనులకు తానే శంకుస్థాపన చేసి యుద్ధ ప్రాతిపదికన పనులు జరిపిస్తానని కేసీఆర్ స్పష్టం చేశారు. రంజాన్ నెల ప్రారంభానికి ముందే పాతబస్తీలో పర్యటించి అభివృద్ధి పనుల ప్రకటన చేస్తామని సీఎం హామీ ఇచ్చారు.
సమైక్య పాలనలో పాత బస్తీ చాలా నిర్లక్ష్యానికి గురైందని అక్కడ కనీస మౌలిక సదుపాయాలు కూడా కల్పించలేదని ముఖ్యమంత్రి అన్నారు. పాతబస్తీలో విద్యుత్ కోతలని,మంచినీటి ఎద్దడని,రోడ్లు సరిగా లేవని మురికి నీరు రోడ్లపై ప్రవహిస్తుందని తాను 30 ఏళ్ల నుంచి వింటున్నానని సీఎం అన్నారు.
వరదలకు ఆస్కారం లేకుండా పాతబస్తీని తీర్చిదిద్దేందుకు ప్రణాళిక రూపొందించాలన్నారు. అన్ని సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేలా అధికారులు ప్రణాళిక రూపొందించాలని సీఎం ఆదేశించారు. మూసీ నది ప్రక్షాళన, మెట్రో రైలు పనులు త్వరగా పూర్తి చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు.
తెలంగాణ వచ్చిన తర్వాత కూడా పరిస్ధితి కొనసాగడానికి వీలు లేదని,పాతబస్తీ అభివృద్ధి మౌలిక సదుపాయాల కల్పనకు సమగ్ర ప్రణాళిక రూపొందించి అమలుచేయాలని అధికారులను ఆదేశించారు. పాతబస్తీలో విద్యుత్ సంబంధిత సమస్యలన్నింటికీ పుల్ స్టాప్ పెట్టాలి…నాణ్యమైన విద్యుత్ అందించేందుకు కొత్తగా మరో ఐదు 33/11 కెవి సబ్ స్టేషన్లు నిర్మించాలని తలపెట్టామని సీఎం తెలిపారు.
ఎంతఖర్చయినా వెనుకాడకుండా పాతబస్తీలో మంచినీటి ఎద్దడి నివారణకు శాశ్వత ప్రతిపాదికన చర్యలు తీసుకోవాలి…ప్రతీబస్తీకి ప్రతీ ఇంటికి మంచినీరు అందించాలని సూచించారు. పాతబస్తీలో ఏడు ప్రాంతాల్లో మంచినీటి రిజర్వాయర్లు నిర్మించాలని,నిజాం కాలంలో బూర్గుపల్లి రామకృష్ణారావు ముఖ్యమంత్రిగా ఉన్నకాలంలో వేసిన పైపులైన్లే ఇంకా ఉన్నాయని అన్నారు. బస్తీ దవాఖానల్లోని వైద్య పరీక్షలు నిర్వహించడానికి అవసరమైన పరికరాలు ఉండేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. నగరంలో వీలైనన్నీ ఎక్కువ ప్రాంతాల్లో డయాలసిస్ కేంద్రాలు ప్రారంభించాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డిని కోరారు.