సంగారెడ్డి జిల్లాలోని రామచంద్రపురం ముత్తూట్ ఫైనాన్స్‌లో సినీ ఫక్కీలో భారీ చోరి జరిగింది. సీబీఐ అధికారులమంటూ ముత్తూట్ ఆఫీసులోకి ప్రవేశించిన దుండగులు ఏకంగా 10 కోట్ల విలువైన బంగారాన్ని అపహరించారు. ఈ దొంగతనంలో ఐదుగురు పాల్గొన్నట్లు అధికారులు గుర్తించారు.
ముఖానికి ముసుగు ధరించి దుండగులు వచ్చినట్లు స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వచ్చిన దుండగుల్లో ఇద్దరు సాధారణ దుస్తులు, మరో ఇద్దరు పోలీసు డ్రెస్సులు ధరించినట్లు తెలిపారు. తుపాకులతో బెదిరించి బంగారాన్ని దోచుకెళ్లారని ముత్తూట్ ఫైనాన్స్ సిబ్బంది పేర్కొన్నారు. ముత్తూట్ ఫైనాన్స్ వద్దకు వచ్చిన పోలీసులు చోరీపై ఆరా తీస్తున్నారు.ఈ బ్రాంచీలో భారీ అవినీతి జరిగిందని తమకు సమాచారం ఉందని పోలీసులు చెప్పారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
తెలిసినవారి పనా, లేక పాత నేరస్తులు ఎవరైనా ఈ దోపిడీకి పాల్పడ్డారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ముత్తూట్ ఫైనాన్స్ సంస్థ సిబ్బందిని అడిగి వివరాలు సేకరిస్తున్నారు. మూడేళ్ల క్రితం ఇదే సంస్థలో ఉగ్రవాదులు చోరీకి పాల్పడ్డారు.మధ్యప్రదేశ్ లోని తాండ్వా జైలు నుంచి తప్పించుకుని వచ్చిన ఉగ్రవాదులు ఈ దోపిడీకి పాల్పడి….కలకలం సృష్టించారు. కస్టమర్లుగా లోపలికి ప్రవేశించిన దుండగులు..ఐదు కిలోల బంగారం, డబ్బును ఎత్తుకెళ్లిన సంగతి తెలిసిందే.