మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సరికొత్త లుక్‌లో కనిపించారు. అంతే కాకుండా అదే వస్త్రధారణలో టాలీవుడ్ ప్రముఖ నటులు మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జునలు కూడా దర్శనమిచ్చారు. అయితా ఈ ముగ్గురు ఎలా కలిశారనేగా?… ఇండియన్ సాకర్ లీగ్ (ఐఎస్ఎల్) టోర్నీ వచ్చే నెల 1 నుంచి ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో కేరళ బ్లాస్టర్స్ పేరిట ఓ జట్టు రంగంలోకి దిగబోతోంది. ఈ సంధర్బంగా సచిన్‌తో పాటు ఫ్రాంచైజీ సహ యజమానులు నిమ్మగడ్డ ప్రసాద్, చిరంజీవి, అక్కినేని నాగార్జున, అల్లు అరవింద్ కూడా ఇందులో పాల్గొన్నారు. వీళ్లంతా కేరళ సంప్రదాయ శైలి అయిన పంచె కట్టులో సందడి చేస్తూ ఆటగాళ్లను ఉత్సాహపరిచారు. బంగారు అంచుతో కూడి పంచెపై పసుపు రంగు జెర్సీని ధరించి ఆటగాళ్లతో కలిసి ఫొటోలకు ఫోజులిచ్చారు.
ఇండియన్ సూపర్ లీగ్ ఫుట్‌బాల్ మూడో సీజన్‌లో మరింత మెరుగైన ప్రదర్శన కనబరుస్తామని మాజీ క్రికెటర్, కేరళ బ్లాస్టర్స్ టీమ్ యజమాని సచిన్ టెండూల్కర్ విశ్వాసం వ్యక్తం చేశారు. ‘కుర్రాళ్లు, అనుభవజ్ఞులతో కూడిన మా జట్టులో మంచి ప్రతిభ ఉంది. అటాకింగ్ తరహా ఆటతో మైదానంలో దూసుకుపోవాలని వారు ఉత్సాహంగా ఉన్నారు‘ అని సచిన్ అన్నారు.
ఆద్యంతం ఉల్లాసంగా జరిగిన ఈ కార్యక్రమంలో సచిన్ టీమ్ ఆటగాళ్లను పరిచయం చేశాడు. గత ఏడాది ఆడిన జట్టులో ఆంటోనియా జర్మన్, జోసూలతో పాటు ఐదుగురు భారత ఆటగాళ్లను ఈ సారి కూడా బ్లాస్టర్స్ కొనసాగించింది. 27 మంది సభ్యుల టీమ్‌లో మిగతావారంతా కొత్తవారే. మార్క్యూ ప్లేయర్ ఆరోన్ హ్యూజెస్‌తో పాటు దిదియార్ బోరిస్, సెడ్రిక్ హెంగ్‌బార్ట్ ఆటగాళ్లు జట్టులో ఉన్నారు. మాంచెస్టర్ యునెటైడ్ మాజీ ఆటగాడు స్టీఫెన్ కోపెల్‌ను ఈ సారి జట్టు కోచ్‌గా ఎంచుకుంది. కాగా, ఐఎస్‌ఎల్ ముందు కేరళ బ్లాస్టర్స్ థాయ్‌లాండ్‌లో ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడనుంది.