రామజోగయ్య శాస్త్రి పుట్టిన రోజు

743
Ramajogayya Sastry
Ramajogayya Sastry
- Advertisement -

రామజోగయ్య శాస్త్రి.. అలరించే, ఆలోచింపచేసే, ఆసక్తి రేపే, ఉత్తేజాన్నిచ్చే పాటలకు కేరాఫ్‌.
అన్ని రకాల పాటలతో శ్రోతల్ని, ప్రేక్షకుల్ని మెప్పించి, తన కలానికి అన్ని వైపులా పదునుందని నిరూపించుకున్న దిట్ట. పాటల సాహిత్యంలో ఆల్‌రౌండర్‌గా అందరి మన్ననలు పొంది,అనతికాలంలోనే అగ్ర గీత రచయితగా ఎదిగిన రామజోగయ్య శాస్త్రి పుట్టినరోజు (బుధవారం) నేడు.

ఈ తరం ప్రేక్షకులను హుషారెక్కిస్తూ పాటలు పలికిస్తున్నారు రామజోగయ్య శాస్త్రి… ఈ కాలం కుర్రకారుకు రామజోగయ్య పాటలంటే మహా ఇష్టం!… తెలుగు పదాలతో అన్యదేశ్యాలను అలవోకగా జతకట్టడంలో సిద్ధహస్తులు రామజోగయ్య… అవి దుష్టసమాసాలైనా ఇష్టంగా ఉపయోగిస్తూ ప్రేక్షకులను ఏ మాత్రం కష్టపెట్టకుండా తనవైపు ఆకర్షించుకోవడం కూడా రామజోగయ్యకు బాగా తెలుసు… అందుకే ఆయన పాటకు ఈ తరం పట్టాభిషేకం చేస్తోంది… సందర్భానుసారంగా తన కలాన్ని పరుగులు తీయిస్తూ, తనదైనబాణీ పలికించడంలో మేటి రామజోగయ్య …

ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు… కానీ, రామజోగయ్య ముందుగా రచ్చ గెలిచి తరువాతే ఇంట గెలుపు సాధించారు… కరగ్ పూర్ ఐఐటీలో ఎమ్.టెక్ చేసిన రామజోగయ్య వృత్తిరీత్యా బెంగళూరు చేరారు- అక్కడ కన్నడ భాషపై పట్టుసాధించి, ముందుగా కన్నడ చిత్రాలకు పాటలు రాశారు… కన్నడలిపి పట్టుపడకున్నా, తెలుగు అక్షరాల్లోనే కన్నడ పదాలను పలికించి విజయం సాధించారాయన… స్రవంతి రవికిశోర్ నిర్మించిన ‘యువసేన’ చిత్రం ద్వారా తెలుగుపాటను పలికించారు రామజోగయ్య… అనతికాలంలోనే జూనియర్ సీతారామశాస్త్రిగా పేరు సంపాదించారు… సీతారామశాస్త్రి సైతం ప్రోత్సహిస్తూ ఉండడంతో ఆయన పంథాలోనే పయనిస్తూ రామజోగయ్య తనకంటూ ఓ బాణీ ఏర్పరచుకోవడానికి ప్రయత్నించారు.

ఎక్కువగా హిందీ, ఉర్దూ పదాలను తన పాటల్లో మేళవించి రక్తి కట్టించారు జోగయ్య… కవిత్వంలో పరభాషా పదాలను ఉపయోగించడం నేరమేమీ కాదంటారు రామజోగయ్య… ఏది ఏమైనా – రామజోగయ్య బాణీకి ప్రస్తుతం ఎనలేని క్రేజ్ ఉందన్న మాట వాస్తవం… అందుకు నిదర్శనమే ఇటీవల వచ్చిన మహేశ్ బాబు ‘శ్రీమంతుడు’ సినిమాలో పాటలకు రామజోగయ్య శాస్త్రి సింగిల్ కార్డ్…. సో ఆయన మరిన్ని వసంతాలు చూస్తూ హాయిగా సాగిపోవాలని ఆశిస్తూ రామజోగయ్య శాస్త్రి పుట్టిన రోజు సందర్భంగా గ్రేట్‌ తెలంగాణ.కామ్‌ తరుపున జన్మదిన శుభాకాంక్షలు.

- Advertisement -