రియో ఒలింపిక్స్ లో రజత పతకం సాధించిన తొలి భారత మహిళగా కీర్తి పతాకం ఎగురవేసిన తెలుగమ్మాయి పూసర్ల వెంకట సింధుకు విజయవాడలో అపూర్వ స్వాగతం లభించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన పర్యటనల కోసం ఉపయోగించే ప్రత్యేక విమానాన్ని సింధు కోసం పంపారు.
ఎప్పుడూ సాధారణ విమానాలు వెళ్లే శంషాబాద్ విమానాశ్రయం నుంచి కాక.. వీఐపీల కోసం మాత్రమే ఉపయోగించే బేగంపేట విమానాశ్రయం నుంచి.. ఈ ప్రత్యేక విమానంలో పీవీ సింధు, ఆమె కుటుంబ సభ్యులు, కోచ్ గోపీచంద్ అంతా బయల్దేరారు. విజయవాడ ఎంపీ కేశినేని నాని స్వయంగా వాళ్లను తోడ్కొని హైదరాబాద్ నుంచి గన్నవరం విమానాశ్రయానికి తీసుకెళ్లారు.
హైదరాబాద్ నుంచి గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్న పీవీ సింధు, గోపిచంద్‌కు ఏపీ మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, అచ్చెన్నాయుడు, ప్రత్తిపాటిపుల్లారావు, నారాయణ, ఎంపీలు మురళీమోహన్, కేశినేని నాని, విద్యార్థులు, పలువురు ప్రజాప్రతినిధులు స్వాగతం పలికారు. గన్నవరం నుంచి ప్రారంభమైన విజయోత్సవ ర్యాలీ విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియం వరకు నిర్వహించనున్నారు. గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి రెండు కిలోమీటర్ల మేర పొడువైన జాతీయ పతాకంతో పీవీ సింధుకు స్వాగతం పలికేందుకు చిన్నారులు బారులు తీరారు.
గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక వాహనంలో ర్యాలీగా విజయవాడ బయలుదేరిన సింధుకు అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం పట్టారు. విద్యార్థులు, క్రీడాభిమానులు, ప్రజలు రహదారికి ఇరువైపులా జాతీయజెండా చేతబూనిసింధుకు స్వాగతం పలికారు. ర్యాలీ సందర్భంగా సింధు క్రీడాభిమానులకు అభివాదాలు చేస్తూ ముందుకు సాగింది. ప్రజల నుంచి కనీవినీ ఎరుగని రీతిలో లభించిన అపూర్వ స్పందనకు సింధు పరవశురాలైంది.
ఈ నేపథ్యంలో విజయవాడ పరిసర ప్రాంతాల్లో భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. ర్యాలీ సందర్భంగా విజయవాడలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. విజయోత్సవ ర్యాలీ అనంతరం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా సింధును సన్మానించనున్నారు. అందులోనూ ఈ రోజు కృష్ణా పుష్కరాలు ముగియనుండటంతో సాయంత్రం కృష్ణా హారతి కార్యక్రమానికి పీవీ సింధు హాజరుకానుంది.