రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు నైపుణ్యశిక్షణ ఇచ్చేందుకు తెలంగాణ జాగృతి నడుం బిగించింది.లక్ష మంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలన్న లక్ష్యంతో అశోక్ నగర్‌లో ఏర్పాటుచేసిన జాగృతి స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను కేంద్ర మంత్రి రాజీవ్‌ప్రతాప్‌రూడీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, టీఆర్ఎస్ ఎంపీ కవిత ప్రారంభించారు. జాగృతి ఫోటో ఎగ్జిబిషన్ ను కేంద్ర మంత్రికి కవిత వివరించారు. ఈ సందర్భంగా ఎంపీ కవిత మాట్లాడుతూ తెలంగాణలో నిరుద్యోగుల శాతం ఎక్కువ అని వారికి నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు కల్పిస్తామని తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా 12 నైపుణ్య శిక్షణాకేంద్రాలు ప్రారంభించామన్నారు. ఈ సెంటర్లన్నింటీకి కేంద్ర ప్రభుత్వ గుర్తింపు ఉందని కవిత వెల్లడించారు.
స్కిల్ డెవలప్ మెంట్ యువతకు ఆత్మవిశ్వాసాన్నిస్తుందని గవర్నర్ నరసింహన్ అన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందడం లేదని….విద్యారంగం అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. విద్యారంగం అభివృద్ధి చెందితే…దేశం అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఇందుకు సమాజం మొత్తం జాగృతం కావాలన్నారు.
స్కిల్ డెవలప్‌మెంట్ శిక్షణలో తెలంగాణ జాగృతి దేశానికే ఆదర్శమని కేంద్రమంత్రి రాజీవ్ ప్రతాప్ రూడీ కొనియాడారు. అశోక్‌నగర్‌లో స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను కేంద్ర మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజీవ్ ప్రతాప్ రూడీ మాట్లాడుతూ.. స్కిల్ డెవలప్‌మెంట్‌లో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, టీఆర్ఎస్ ఎంపీ కవిత కృషి ప్రశంసనీయమన్నారు. స్కిల్ ఇండియా మిషన్‌ను ప్రధాని మోడీ ప్రారంభించారని తెలిపారు. దేశంలో మొదటిసారిగా కేంద్ర ప్రభుత్వం స్కిల్ డెవలప్‌మెంట్ కోసం ప్రత్యేక శాఖను తీసుకొచ్చిందని గుర్తు చేశారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.తెలంగాణ జాగృతి నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి అన్ని విధాలా అండగా ఉంటామని స్పష్టం చేశారు.
ఈ సెంటర్ లో సాంకేతిక అంశాల్లో నిరుద్యోగ యువతీయువకులకు ఉత్తమమైన శిక్షణ ఇవ్వనున్నారు. రాష్ట్రంలోని 17 పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లు ఏర్పాటు చేసి 18-35 ఏండ్ల వయస్సు ఉన్నవారికి శిక్షణ ఇస్తారు. ముఖ్యంగా మహిళలు, స్కూల్ డ్రాపౌట్ అయిన వారికి, వికలాంగులకు, గ్రాడ్యుయేట్లకు, చేతివృత్తి కళాకారులకు శిక్షణ ఇవ్వడమే కాకుండా ఉద్యోగ అవకాశాలను జాగృతి కల్పిస్తున్నది. ఇప్పటికే నేషనల్ డిజిటల్ లిటరీ మిషన్ కింద ఇప్పటి వరకు 995 మందికి శిక్షణ ఇచ్చారు. ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన కింద కుట్టుమిషన్, చేతి ఎంబ్రాయిడరీ, ఫుడ్ అండ్ బేవరేజస్ సర్వీస్, హౌజ్‌కీపింగ్, కంప్యూటర్ అనుబంధాల ఇన్‌స్టాలేషన్, ఫీల్డ్ టెక్నీషియన్, సరుకు రవాణా ట్రాకింక్, సరుకు బుకింగ్ ఎగ్జిక్యూటీవ్, రిటైల్ సేల్స్ అసోసియేట్ యానిమేటర్, మైక్రో ఇరిగేషన్ టెక్నీషియన్, కస్టమర్ రిలేషన్ ఎగ్జిక్యూటీవ్ రంగాల్లో 3353 మందికి శిక్షణ ఇచ్చారు.