కృష్ణా పుష్కరాలు ముగింపు దశకు చేరుకున్నాయి. ఈనెల 12న ప్రారంభమైన పుష్కరాలు నేటితో ముగుస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యంత వైభవంగా జరిగిన పుష్కరాల్లో కోట్లాది మంది భక్తులు పుణ్య స్నానాలు చేసి, నదీమతల్లికి నీరాజనాలు పలికారు. దీపారాదనలు చేసిన కృష్ణమ్మకు ప్రణమిల్లి నమస్కరించారు. లక్షలాది మంది భక్తులు పితృదేవతలకు పిండ ప్రదానాలు చేశారు. రెండు ప్రభుత్వాలు విస్తృత ఏర్పాట్లు చేయడంతో యాత్రికులు ఎటువంటి అసౌకర్యం లేకుండా పుష్కర స్నానాలు చేయగలిగారు. ఈరోజు పుష్కరాల ముగింపు కార్యక్రమాలను భారీ ఎత్తున నిర్వహించేందుకు ప్రభుత్వాలు భారీ ఏర్పాట్లు చేశాయి.
పుష్కరాల ముగింపు సందర్భంగా ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. బీచుపల్లి, గొందిమళ్ల, సోమశిల, రంగాపూర్ ఘాట్లలో ప్రత్యేక హారతి కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి మంత్రులు జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డి పలువురు ప్రజాప్రతినిధులు హాజరుకానున్నారు. కృష్ణా పుష్కరాలు అఖరి రోజు కావడంతో పుష్కర ఘాట్ల వద్ద భక్తులు భారీసంఖ్యలో వచ్చి పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. దాంతో తెలుగు రాష్ట్రాల్లో ఏర్పాటు చేసిన పుష్కరఘాట్లన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి.
నల్లగొండ జిల్లాలో మట్టపల్లి, వాడపల్లి, నాగార్జున సాగర్ ఘాట్లలో భక్తుల పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలో బీచుపల్లి, గొందిమళ్ల, సోమశిల ఘాట్లలో భక్తుల రద్దీ పెరుగుతోంది.