మతం వేరైనా మానవత్వం ఒకటే అని నిరూపించారు ఆ యువకులు. హిందూ మతానికి చెందిన ఓ వ్యక్తి మృతిచెందడంతో ఆయన అంత్యక్రియలను ఎనిమిది మంది ముస్లిం యువకుల నిర్వహించి అందరి ప్రశంసలు పొందుతున్నారు. మహారాష్ట్రలోని కౌసా ప్రాంతంలో వామన్ కదమ్ (65) అనే వ్యక్తి తన భార్యతో కలిసి జీవిస్తున్నాడు. వారికి నా అన్నవారెవ్వరూ లేరు. అకస్మాత్తుగా ఆయన గత అర్ధరాత్రి మృతి చెందారు. దీంతో అంతవరకు జీవితం పంచుకున్న వ్యక్తి దూరం కావడంతో షాక్ కు గురైన అతని భార్యకు ఏం చేయాలో పాలుపోలేదు. సహాయం అడిగేందుకు నా అన్న వారు కూడా లేకపోవడంతో, ఆమె జరిగిన దారుణాన్ని చుట్టుపక్కల వారికి తెలిపింది.
ఆయనకు తన భార్య తప్ప మరెవరూ లేకపోవడంతో ఆయన అంత్యక్రియలను నిర్వహించేందుకు ఈ ముస్లిం మతానికి చెందిన యువకులు ముందుకొచ్చారు. అంత్యక్రియలకు కావాల్సిన సామగ్రిని కొని మృతదేహాన్ని శ్మశాన వాటిక వరకు మోసుకెళ్లి దహనసంస్కారాలు పూర్తిచేశారు.
వీరు చేసిన ఈ మంచిపని ముంబ్రా ఎమ్మెల్యే జితేంద్రకు తెలియడంతో వెంటనే వారికి సెల్యూట్ చేస్తూ ఫేస్బుక్ పోస్ట్ చేశారు. అంతేకాదు ముంబ్రా ప్రాంతంలో అత్యధికంగా నివసించేది ముస్లింలే. వారు కూడా ఈ యువకులను అభినందనలతో ముంచెత్తారు. ముస్లిం యువకులు చూపిన మానవత్వానికి సోషల్ మీడియాలో నెటిజన్లంతా అభినందనలు తెలుపుతున్నారు.