‘మహా’ విజయంతో..కేసీఆర్‌కు ఘనస్వాగతం..!

251
- Advertisement -

సాగునీటి ప్రాజెక్టులపై మహారాష్ట్ర ప్రభుత్వంతో చరిత్రాత్మక ఒప్పందం కుదుర్చుకొని బుధవారం నగరానికి తిరిగివస్తున్న సీఎం కేసీఆర్‌కు ఘన స్వాగతం పలికేందుకు టీఆర్‌ఎస్ శ్రేణులు సిద్ధమయ్యాయి. బేగంపేట ఎయిర్ పోర్టుకు మధ్యాహ్నం 3 గంటలకు సీఎం కేసీఆర్‌ చేరుకోనున్నారు. విమానాశ్రయం వద్ద భారీగా స్వాగత కార్యక్రమం ఏర్పాటు చేశా రు.దీనికి దాదాపు లక్ష మంది జనాన్ని సమీకరించనున్నారు. వేదికపై సీఎం ప్రసంగించిన అనంతరం భారీ ర్యాలీగా క్యాంపు కార్యాలయానికి చేరుకునేలా ప్రణాళిక సిద్ధం చేశారు.

జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివస్తున్నారు. దాదాపుగా రెండు వేలమంది కళాకారులతో స్వాగతం పలికేందుకు సాంస్కృతిక శాఖ ఏర్పాట్లు చేసింది. మహారాష్ట్రతో కుదుర్చుకున్న ఒప్పందం తదితర అంశాలపై దాదాపు 45 నిమిషాల పాటు సీఎం కేసీఆర్ వివరించనున్నారు. జిల్లాలనుంచి రైతులు, ప్రజలు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు భారీ ఎత్తున తరలివస్తున్న నేపథ్యంలో బందోబస్తు, పారిశుధ్యం, తాగునీరు తదితర ఏర్పాట్లలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా అధికారులు ఏర్పాట్లుచేశారు.

రాష్ట్రం నలుమూలల నుంచి ప్రజలను తీసుకొచ్చే వాహనాలు పార్క్ చేయడానికి ఎయిర్‌పోర్టు కార్గో కాంప్లెక్స్, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, నవయుగ బిల్డింగ్, పాటిగడ్డ రోడ్డు, రసూల్‌పురా హాకీ గ్రౌండ్, వెస్లీ కాలేజ్ గ్రౌండ్, సికింద్రాబాద్ పీజీ కాలేజ్‌లలో ఏర్పాట్లు చేశారు. సభకు వచ్చే ప్రజల దాహార్తి తీర్చడానికి లక్ష మంచినీటి పాకెట్లను అందుబాటులో ఉంచారు.

- Advertisement -