రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు, వరదల నేపథ్యంలో మంత్రులంతా జిల్లాల్లోనే ఉండి పరిస్థతిని పర్యవేక్షించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఈ నేపథ్యంలో సోమవారం జరగాల్సిన మంత్రి వర్గ సమావేశాన్ని రద్దు చేస్తున్నట్టు తెలిపారు.
మంత్రులు, జిల్లా అధికారులు సమన్వయంతో పనిచేసి వరదలు తలెత్తే పరిస్థితిని సమీక్షించాలన్నారు. ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా చూడాల్సిన బాధ్యత వారిదేనని స్పష్టం చేశారు. గోదావరికి వరద పోటెత్తుతున్న నేపథ్యంలో ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాల మంత్రులు, అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని కోరారు.
గోదావరికి వరదల దృష్ట్యా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని కేసీఆర్ ఆదేశించారు. గోదావరి నదికి కొనసాగుతున్న వరద ఉధృతిపై సీఎం మంత్రి హరీశ్‌రావు, సీఎస్ రాజీవ్‌శర్మలతో ఫోన్లో మాట్లాడారు. గోదావరికి వరదల దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలన్నారు. అదేవిధంగా లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో మిడ్‌మానేరు వద్ద పరిస్థితిని పరిశీలించేందుకు మంత్రి హరీశ్‌రావు బయలుదేరి వెళ్లారు.