ఇదేదో బూతు రాహుల్ నోటి వెంట వచ్చిన బూతు కాదు…వరుస ఓటములతో పాటు ఐరెన్ లెగ్ పేరు సార్ధకం చేసుకున్న రాహుల్ గాంధీ, యూపీ ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగా భారీ వ్యుహాలు సిద్ధం చేస్తున్నారు. ఇప్పటివరకు ఎన్నికల ప్రచారం అంటే రోడ్ షో,బహిరంగసభలు,ఇంటింటి ప్రచారాలు,ఆకట్టుకునే వేషదారణలు,హీరో,హీరోయిన్లతో ప్రచారాలు చూశాం. కానీ ఇకపై ‘ఖాట్‌సభ’ లను చూడనున్నాం.
2019 ఎన్నికల్లో మోడీ గెలుపుకు కృషిచేసిన ప్రశాంత్ కిషోర్ ను సలాహాదరుగా నియమించుకున్న కాంగ్రెస్ పార్టీ.. ముఖ్యమంత్రి అభ్యర్థిగా షీలా దీక్షిత్ ను ప్రకటించింది. ఈ నేపథ్యంలో పార్టీని గెలిపించే బాధ్యతను భుజాన వేసకున్న రాహుల్.. యూపీలో 25 రోజుల పాటు సుడిగాలి పర్యటన చేయాలని నిర్ణయించారు. దాదాపు 42 జిల్లాల్లోని అసెంబ్లీ నియోజకవర్గాలను చుట్టిరావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఈ నేపథ్యంలోనే దేవరియా జిల్లా రుద్రాపూర్‌లో రైతులతో భారీ బహిరంగ సభలో పాల్గొననున్నారు. అయితే ‘ఖాట్‌సభ’ పేరుతో నిర్వహించే ఈ సభలో రైతులు తీరిగ్గా కూర్చోవడానికి ఏకంగా 2వేల మంచాలను ఏర్పాటుచేశారు. రైతులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకోనున్నారు. ఖాట్ సభ పేరుతో రాహుల్ నిర్వహించే సభకు విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి కాంగ్రెస్ శ్రేణులు.
అదేవిధంగా నెల రోజుల పాటు 223 అసెంబ్లీ నియోజకవర్గాల్లో (ఉత్తర్‌ప్రదేశ్‌లో మొత్తం నియోజకవర్గాలు 403) రాహుల్ పర్యటించనున్నారు. యాత్రలో భాగంగా ప్రతి గ్రామంలోనూ పాదయాత్ర చేసి ఇంటింటికి వెళ్లి రైతులతో ముచ్చటించనున్నారు. దశాబ్దాల క్రితం యూపీలో దూరమైన అధికారాన్ని ఈ దఫా ఎలాగైనా తిరిగి చేజిక్కించుకోవాలని,తన సమర్థతను చాటుకొని, దేశ రాజకీయాలను తన చేతుల్లోకి తీసుకోవాలని రాహుల్ చేస్తున్న సరికొత్త ప్రయోగాలు సత్పలితాలనిస్తాయో లేదో చూడాలి.