సినిమాల పరంగా స్టార్ హీరోల మధ్య పోటి సహజం. అయితే ఇది ఇప్పుడు పక్క ఇండస్ట్రీలకు పాకింది. ఇటీవల కాలంలో స్టార్ హీరోల సినిమాలు ఇతర భాషల్లోకి డబ్ అవుతున్నాయి. తమిళ సినిమాలు ఇతర భాషల్లోకి అనువాదం అవ్వడం ఎప్పుటినుంచో ఉంది. తెలుగు సినిమాలు ఈ విషయంలో చాలా వెనకబడ్డాయి. అయితే ఇటీవలి కాలంలో తెలుగు హీరోలు ఇతరభాషల్లో సత్తా చాటుతున్నారు. వారిలో స్టైలిష్ స్టార్ బన్నీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.
ఆర్యతో కేరళలో అడుగుపెట్టిన ఈస్టార్ హీరో అక్కడ అభిమానులు సంపాదించుకోవడంతో పాటు కలక్షన్ల పరంగా టాప్ లో దూసుకుపోతున్నాడు. మలయాళం స్టార్ హీరోలు, అరవ హీరోలతో పోల్చుకుంటే బన్నీ హంగామా కేరళలో అంతా ఇంతా కాదు. అయితే బన్నీ తరువాత ఆ రేంజ్ లో కేరళలో టాలీవుడ్ హీరోలు పెద్దగా క్లిక్ కాలేదు. అయితే జనతాగ్యారేజ్ తో కేరళలో అడుగుపెట్టిన ఎన్టీఆర్ అక్కడ మార్కెట్‌ను పెంచుకునేందుకు ఇప్పటి నుంచే ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పటి వరకు బన్నీ సినిమాలన్నీ అక్కడ అనువాదం రూపంలో విడుదలైనవే.
ఎన్టీఆర్ జనతాగ్యారేజ్ మాత్రం అక్కడ స్ట్రైట్ సినిమా ఫీల్‌తో రిలీజ్ అయ్యి, ఫస్ట్ డేనే పాజిటీవ్ టాక్ తెచ్చుకుంది.మాలీవుడ్ లో పాగా వేయాలని భావిస్తున్న తారక్ కు ఇది శుభపరిణామం. అయితే మోహన్ లాల్ ,నిత్యామీనన్ లాంటి స్టార్లు ఉండడం అక్కడ ఎన్టీఆర్ ఎంట్రీకి ప్లస్ అయ్యిందని చెప్పొచ్చు. సహజంగానే మోహన్ లాల్ ఫ్యాన్స్ నుంచి ఎన్టీఆర్ కు మద్దతు దొరుకుతుంది. ఈ విషయంలో అల్లుఅర్జున్ కు కేరళలో టాలెంట్ తో పాటు లక్కు కలిసివచ్చింది.
మాలీవుడ్ లో ఏహీరో అండదండలు లేకుండానే బన్నీ అక్కడ స్టార్ హీరో అయిపోయాడు. ఇక కలెక్షన్ల విషయానికొస్తే.. మాలీవుడ్ లో ఇప్పటివరకు బాహుబలి 14 కోట్లతో మొదటి స్థానంలో ఉంది. ఆ తరువాత 7.5 కోట్లతో సరైనోడు 2 స్థానంలో ఉండగా.. ఆపై వరుసగా ఐదు సినిమాలు అల్లు అర్జున్ వే ఉన్నాయి. జనతా మలయాళం హక్కులు 8 కోట్లకు అమ్మారు. ఒకవేళ పెట్టిన డబ్బులు తిరిగివచ్చినా ఎన్టీఆర్, బన్నీ రికార్డులను కొల్లగొట్టినట్లే. అదే జరిగితే మాలీవుడ్ లో ఎన్టీఆర్ కు బన్నీకీ మధ్య స్టార్ వార్ మొదలైనట్లేనని అంటున్నారు సినీపండితులు.