పాస్‑పోర్ట్‑ దరఖాస్తులో తండ్రిపేరును కచ్చితంగా నమోదుచేయాల్సిన అవసరం లేదని ఢిల్లీ హైకోర్టు తీర్పునిచ్చింది. చట్టరీత్యా తండ్రిపేరు ట్రావెల్ డాక్యుమెంట్‑లో తప్పనిసరేమీ కాదని పేర్కొంది. పాస్‌పోర్ట్‌లో కచ్చితంగా తండ్రి పేరును నమోదు చేయాలన్న న్యాయపరమైన నిబంధన ఏదీ లేదని న్యాయమూర్తి సంజీవ్ సచ్‌దేవ్ పేర్కొన్నారు. గత మేలో ఓ కేసులో ఇచ్చిన తీర్పు ఆధారంగానే ఇవాళ కూడా జస్టిస్ ఈ తీర్పును వెలువరించారు.
ఢిల్లీ యువకుడు ఒకరు పెట్టుకున్న పాస్‌పోర్ట్ అభ్యర్థనపై కోర్టు ఈ రకంగా స్పందించింది. తన తండ్రి పేరును పాస్‌పోర్ట్‌లో ప్రస్తావించని కారణంగా అతనికి పోస్‌పోర్ట్ జారీ చేసేందుకు ప్రాంతీయ కార్యాలయం నిరాకరించింది. దాంతో అతను కోర్టును ఆశ్రయించాడు. వాస్తవానికి యువకుడి తల్లితండ్రులు విడిపోవడం వల్ల ఆ అభ్యర్థి పాస్‌పోర్ట్ దరఖాస్తులో తన తండ్రి పేరును ప్రస్తావించలేదు. అయితే దరఖాస్తులో తండ్రి పేరును నమోదు చేయకుంటే పాస్‌పోర్ట్ కార్యాలయం ఆ దరఖాస్తును స్వీకరించదని అధికారులు తెలిపారు.
2003లో నిర్లక్ష్యంగా వ్యవహరించే తన తండ్రి నుంచి తల్లి విడాకులు పొందిందని, ఈ నేపథ్యంలో రెన్యువల్ ఫామ్‑లో తండ్రి పేరును నమోదుచేయలేదని ఆ యువకుడు పేర్కొన్నాడు. తండ్రి పేరు లేని అప్లికేషన్‑ను సాప్ట్ వేర్ ఆమోదించదని, తప్పనిసరిగా తండ్రిపేరు నమోదుచేయాలని పాస్‑పోర్టు అథారిటీలు వాదించాయి. అయితే తండ్రిపేరు లేనప్పటికీ అతనికి ముందు పాస్‑పోర్టు జారీచేసిన సంగతిని కోర్టు ప్రశ్నించింది. సాప్ట్‑వేర్‑ను సవరించి అతనికి పాస్‑పోర్టు జారీచేయాలని అథారిటీలను కోర్టు ఆదేశించింది.
భర్త నుండి విడాకులు తీసుకున్న ఒక మహిళ తన బిడ్డ ఖర్చు తానే భరిస్తున్నానని, కావున పాస్ పోర్ట్ లో అతని పేరును తొలగించాలని వేసిన పిటీషన్ కు కూడా ఢిల్లీ కోర్టు ఈ విధంగానే స్పందించిన సంగతి తెలిసిందే. పాస్ పోర్ట్ లో తండ్రి పేరు కచ్చితంగా ఉండాలన్న నిబంధనను సడలించాలని అప్పుడే హైకోర్టు సూచించింది.