ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ ఒడిశా ప్రాంతాలను ఆనుకుని బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాలు ఏపీ, తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. అనేక ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. భారీగా వరదనీరు వచ్చి చేరుతుండటంతో ఆయా ప్రాజెక్టులులకు జలకళ వచ్చింది. భారీ వర్షాలకు పలు గ్రామాలు, పట్టణాలు జలమయంగా మారాయి. కొన్ని ప్రాంతాల్లో నిరంతరాయంగా విద్యుత్ సరఫరా ఆగిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మరో రెండు రోజుల పాటు రెండు రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.
ఇవాళ ఉదయం హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. మియాపూర్, కూకట్‌పల్లి, ఎర్రగడ్డ, బేగంపేట, సికింద్రాబాద్, ఉప్పల్, తార్నాక, నాచారం, ఖైరతాబాద్, సోమాజీగూడ, మలక్‌పేట్, దిల్‌సుఖ్‌నగర్, ఎల్బీనగర్, హయత్‌నగర్, పెద్ద అంబర్‌పేట తదితర ప్రాంతాల్లో వర్షం పడింది. ఆయా ప్రాంతాల్లో రహదారులు జలమయమయ్యాయి. భారీ వర్షాలకు రహదారులపై గుంతల్లో నీరు నిలిచి వాహనచోదకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉదయం కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులు అవస్థలు పడ్డారు.
రాష్ట్రంలో మరో రెండు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్‌లు ప్రారంభించాలని, ఎప్పటికప్పుడు సమాచారం తెప్పించుకొని స్పందించాలని సూచించారు. సీఎం ఆదేశాలతో అలర్టయ్యారు జీహెచ్ఎంసీ అధికారులు. లోతట్టు ప్రాంత ప్రజలను ఖాళీ చేయిస్తున్నారు. (జీహెఎంసీ కంట్రోల్ రూం నెంబర్ 040-23454088).