తుస్సుమన్న కాంగ్రెస్ ప్రెజెంటేషన్

577
- Advertisement -

దున్న ఈనిందా అని ఒకడంటే… దూడను కట్టేయమని ఇంకోకడు అన్నాడట. అట్లా ఉంది మన తెలంగాణ కాంగ్రెస్ నాయకుల నిర్వాకం. తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు అసెంబ్లీ సాక్షిగా జలవనరుల ప్రాజెక్టులపై సవివరంగా ప్రెజెంటేషన్ తో పాటు విషయాలు కూలకంషంగా ప్రజలకు తెలియజెప్పితే పుణ్యకాలం కాస్తా ముగిసాక ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు స్పందిస్తున్నారు. అప్పుడు కేసీఆర్ ఇచ్చిన వివరణ అందరి దృష్టిని ఆకర్షించింది. వెంటనే తాము కూడా ప్రెజెంటేషన్ ఇస్తామని కాంగ్రెస్ నాయకులు బీరాలు పలికారు. అయితే ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ నాయకులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దాసోజు శ్రవణ్ ఇచ్చిన వివరణ ప్రజలకు పెద్దగా అర్ధమయినట్టు అనిపించడం లేదు.

కేసీఆర్కు వారు వేసిన ప్రశ్నలు కూడా అంత ఆసక్తికరంగా లేవు. ఒకపక్క కేసీఆర్ అభివృద్ధిపథంలో దూసుకుపోతుంటే ఏనుగులు పోయే దారిలో కుక్కలు మొరిగిన చందంగా కాంగ్రెస్ వ్యవహారాలు కనిపిస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నది తప్పు అని ఎత్తిచూపుతున్నారు తప్ప అది ఎందుకు తప్పు ఒకవేళ అయిన పక్షంలో మరి వేరే దారి ఏది అన్న వివరణను వారు ఇవ్వలేకపోతున్నారు. ఏది ఏమైనా ఇది ప్రజల చెవికి ఎక్కుతుందా? లేదా అన్నది అసలు విషయం.

కేసీఆర్ చేసిన ప్రెజెంటేషన్ ను ఎత్తిచూపడంలో కాంగ్రెస్ నాయకులు పూర్తిగా విఫలమయ్యారనే చెప్పాలి. అసెంబ్లీ వేదికగా కేసీఆర్ ఇచ్చిన వివరాలను అప్పుడే కాంగ్రెస్ నాయకులు ప్రశ్నిస్తే ఎంతో బాగుండేది. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్న చందంగా ఈ వ్యవహారం ఉంది. మొత్తం మీద ప్రతిపక్షంగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ హుందాగా ప్రవర్తించడం లేదు అని చెప్పడంలో సందేహం అవసరం లేదు. ఇకనైనా కాంగ్రెస్ నాయకులు పూర్తి వివరాలు సేకరించి అవసరమైతే అఖిలపక్షం రూపంలో కేసీఆర్ను కలిసి తెలంగాణ అభివృద్ధికి కృషి చేస్తే మంచిది.

- Advertisement -