ఢిల్లీపై పంజాబ్ గ్రాండ్ విక్టరీ..

583
Indian Premier League
- Advertisement -

ఢిల్లీ క్యాపిటల్‌పై పంజాబ్ గ్రాండ్ విక్టరీ కొట్టింది. సునాయసంగా గెలవాల్సిన మ్యాచ్‌లో ఢిల్లీ బ్యాట్స్‌మెన్ చేతులెత్తేశారు. 24 బంతుల్లో 30 పరుగులు చేయాల్సి ఉండగా చేతిలో 7 వికెట్లు ఉన్నాయి. అయితే ఉహించని విధంగా పంజాబ్ బౌలర్లు రెచ్చిపోవడంతో మొహాలీలో అద్భుతం చోటుచేసుకుంది. సామ్ కరన్(4/11) మ్యాజిక్ స్పెల్‌తో ఢిల్లీని మట్టికరిపించాడు. దీంతో 14 పరుగుల తేడాతో ఢిల్లీని ఓడించింది పంజాబ్.

167 పరుగుల ఛేదనలో ఢిల్లీకి తొలి బంతికే షాక్‌ తగిలింది. గత మ్యాచ్‌లో అద్భుత ఇన్నింగ్స్‌ ఆడిన పృథ్వీ షా (0)ను అశ్విన్‌ తొలి బంతికే ఔట్‌ చేశాడు. కానీ తర్వాత ధావన్‌ (30), శ్రేయస్‌ అయ్యర్‌ (28) కుదురుకోవడంతో ఢిల్లీ కుదుటపడింది. వీరిద్దరూ ఔటైనా పంత్‌, ఇంగ్రామ్‌ భారీ షాట్లకు దిగడంతో మ్యాచ్‌ మళ్లీ ఢిల్లీ వైపు మొగ్గింది. 24 బంతుల్లో 30 పరుగులు చేయాల్సి ఉన్న దశలో ఢిల్లీ విజయం ఖాయం అనుకున్నారంతా. కానీ అనూహ్యంగా షమి బౌలింగ్‌లో పంత్‌, మోరిస్‌ (0) ఔట్‌ కావడం… ఆ తర్వాత ఇంగ్రామ్‌, పటేల్‌ (0)లను కరన్‌ పెవిలియన్‌ చేర్చడంతో ఢిల్లీ ఓటమి తప్పలేదు. ఐపీఎల్‌లో హ్యాట్రిక్‌ సాధించిన 18వ బౌలర్‌గా కరన్‌ నిలిచాడు.

టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌కు శుభారంభం లభించలేదు. కేఎల్‌ రాహుల్‌ (15) పరుగులు మాత్రమే చేసి వెనుదిరిగారు. సామ్‌ కరన్‌ (20),సర్ఫ్‌రాజ్‌ఖాన్‌ (39), మిల్లర్‌ (43) రాణించడంతో 166 పరుగులు చేసింది పంజాబ్. కింగ్స్‌ ఎలెవన్‌కు నాలుగు మ్యాచ్‌ల్లో ఇది మూడో విజయం కాగా రెండు మ్యాచ్‌లు నెగ్గిన ఢిల్లీకి ఇది రెండో ఓటమి.

- Advertisement -