సీమాంధ్ర పాలకులు, చానళ్ల కుట్రలను నిత్యం ఛేదిస్తూ.. తెలంగాణ ప్రజల ఆకాంక్షను వార్తల రూపంలో ప్రతిధ్వనింపజేస్తూ.. ఉద్యమానికి ఊపిరిలూదింది టీ న్యూస్. 24×365 డేస్ ప్రతిరోజూ ఉద్యమమే. తెలంగాణ ప్రజలకు అన్యాయం చేస్తున్నవారిపై టీ న్యూస్ అక్షరకత్తులు నూరింది. అక్షర రూపం దాల్చిన ఒకే ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లను కదిలిస్తదన్న కాళోజీ మాటలను నిజం చేస్తూ.. సమైక్య కుట్రలపై తెలంగాణ ప్రజలను అప్రమత్తం చేసింది. వలసపాలకుల కుట్రలను ఎండగట్టి…ఉద్యమంపై విషంకక్కే ఇంటిదొంగలను.. సీమాంధ్ర వాదులను కుటిలబుద్ధిని కడిగి పారేసింది. స్వరాష్ట్ర ఆకాంక్షను నిజం చేసి… బంగారు తెలంగాణ కోసమే పనిచేస్తున్న ఏకైక చానల్ టీన్యూస్.
ప్రత్యేక రాష్ట్ర సాధనలో ఉద్యమకారుల వెన్నంటి నిలిచిన టీ న్యూస్…..తెలంగాణ పునర్ నిర్మాణంలో తనవంతు పాత్రను పోషిస్తోంది.ఆకుపచ్చ తెలంగాణకు బాసటగా నిలుస్తూ చెట్ల పెంపకంపై ప్రజల్లో అవగాహన కల్పిస్తోంది. ఊరువాడ అన్న తేడా లేకుండా ప్రతి చోట జనాలను మమేకపరుస్తూ..హరితహారంలో భాగస్వాములను చేస్తోంది.టీఆర్ఎస్ సర్కారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకాలను ప్రజలను నిష్పక్షపాతంగా చేరవేయటంలో కీలకపాత్ర పోషిస్తోంది టీ న్యూస్.
తెలంగాణ ప్రజల ఆకాంక్షను గల్లి నుంచి ఢిల్లీ వరకే కాకుండా ఖండాంతరాలకు వినిపించింది టీ న్యూస్. తెలంగాణ ప్రజల సంస్కృతి కాపాడటంతో పాటు ప్రవాసీయులకు బతుకమ్మ,బోనాల విశిష్టతను తెలియజేస్తూ…వారిని భాగస్వాములను చేయడంలో సక్సెసైంది. అమెరికాలో తెలంగాణ ప్రజల గుండెచప్పుడు వినిపించటంలో ముందంజలో నిలిచింది.
తాజాగా ప్రవాసీయుల గొంతుక నమస్తే అమెరికా అంటు ముందుకు వస్తోంది. యోయో టీవీ భాగస్వామ్యంతో సెప్టెంబర్ 4న అతిరథ మహారథుల సమక్షంలో న్యూ జెర్సీలో 6 గంటలకు(భారత కాలమానం ప్రకారం సెప్టెంబర్ 5 ఉదయం 4 గంటలకు) మన ఛానల్… మన వాయిస్ అంటు ప్రజల ముందుకు వస్తోంది. చర్చా వేదికలు, విశ్లేషణాత్మక కథనాలతో వినూత్న శకానికి నాంది పలుకుతోంది టీ న్యూస్. ఈ బృహత్తర కార్యక్రమంలో అమెరికాలోని తెలుగు సంఘాలన్ని పాలు పంచుకుంటున్నాయి. తెలుగు వారి ఐక్యతను మరోసారి చాటిచెప్పనున్నాయి. టీ న్యూస్ ఎండీ సంతోష్ కుమార్ తో పాటు పలువురు రాజకీయ నాయకులు,ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.