‘అహ నా పెళ్ళంట’, ‘పూల రంగడు’ సినిమాలతో కామెడీ సినిమా దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న వీరభద్రం, మూడో సినిమా ‘భాయ్’ పరాజయం తర్వాత కొంత గ్యాప్ తీసుకొని తాజాగా ‘చుట్టాలబ్బాయి’గా ముందుకువచ్చారు. ఆది, నమితా ప్రమోద్ హీరో, హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకువచ్చింది. ‘ప్రేమ కావాలి’.. ‘లవ్‌లీ’ తరవాత ఆదికి మరో విజయం దక్కిందా?ప్రేక్షకులను అలరించిందా లేదా?చూద్దాం..
కథ:
బాబ్జీ (ఆది) ఓ బ్యాంకులో రికవరీ ఏజెంట్‌గా పని చేస్తుంటాడు. మొండి బాకీల్ని ఎలా వసూలు చేయాలో తెలిసినవాడు. ఏసీపీ కమ్ ఎన్‌కౌంటర్ స్పెషలిస్టు (అభిమన్యుసింగ్)కి ఒక్కగానొక్క చెల్లెలు హీరోయిన్ కావ్య (నమిత ప్రమోద్). కావ్య… బాబ్జీతో చనువుగా ఉండడం చూసి బాబ్జీకి వార్నింగ్ ఇస్తాడు ఏసీపీ. ఓసారి ఇంటి నుంచి పారిపోయే ప్రయత్నం చేస్తుంది కావ్య. అదే సమయంలో ఆమెతో అనుకోకుండా బాబ్జీ కనిపించడంతో ‘వాళ్లిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకొని పారిపోతున్నార’ని ఫిక్సయిపోతారు పోలీసులు. పోలీసులని తప్పించుకొనే ప్రయత్నంలో ఉండగానే మరో ముఠా కూడా కావ్య కోసం వెదుకుతూ ఎదురవుతుంది. ఈలోగా దొరబాబు (సాయికుమార్) మనుషులు బాబ్జీ.. కావ్యలను కిడ్నాప్ చేస్తారు. అసలీ దొరబాబు ఎవరు? చివరకు వీరిద్దరు ఒక్కటయ్యారా లేదా అన్నదే మిగితా కథ.
ప్లస్ పాయింట్స్:
సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ హీరో ఆది,ఈగో రెడ్డి. బాబ్జీ పాత్రలో ఆది తన నటనతో ఆకట్టుకున్నాడు.బాబ్జీని పరిచయం చేసే సన్నివేశం.. ఈగో రెడ్డి (పృథ్వీ) పాత్ర నవ్వులు పంచుతాయి.దర్శకుడు వీరభద్రమ్ వినోదాన్ని నమ్ముకొని ఈ కథ రాశారు. నమిత ప్రమోద్ తన పరిది మేరకు ఆకట్టుకుంది. థర్టీ ఈయర్స్ పృథ్వీ తన నటనతో అలరించాడు. దొరబాబుగా సాయికుమార్ ఎప్పటిలా.. నల్లేరు మీద నడకలా నడిచేశాడు. ఈగోరెడ్డి వెనుక పోలీసులు పడడం.. వాళ్ల నుంచి తప్పించుకునేందుకు అతడు చేసే ప్రయత్నాలు నవ్విస్తాయి
మైనస్ పాయింట్స్:
సినిమాకు మేజర్ మైనస్ పాయింట్ కథ. కథలో గొప్ప మలుపులేం ఉండవు. అయితే నడిపించే విధానంలో మాత్రం కాస్త జాగ్రత్త పడినట్టు తెలుస్తుంటుంది. ఫస్టాఫ్‌లో వర్కవుట్ అయిన కామెడీ ద్వితీయార్థంలో పండలేదు. పతాక సన్నివేశాలు అంతగా ఆకట్టుకోవు. బలమైన ప్రతినాయకుడు లేకపోవడం.. కథానాయకుడికి సవాళ్లు ఎదురుకాకపోవడం ఈ కథలో బలహీనతగా కన్పిస్తుంది.
సాంకేతిక విభాగం:
ముందుగా చెప్పుకోవాల్సింది దర్శకుడు వీరభద్రమ్ గురించి…కామెడీని నమ్ముకొని ఈ కథ రాశారు.కథ విషయంలో దర్శకుడు ఇంకాస్త దృష్టి పెడితే బాగుండేది. వినోదం కోసమే అయినా అది నిలవాలంటే పునాది అవసరమే. ఇక సాంకేతికంగా తమన్ పాటలు బాగానే ఉన్నాయి. ‘రబ్బా.. రబ్బా’ బీట్ ఆకట్టుకుంటుంది. కెమెరామెన్ ప్రతిభతో సినిమాకు రిచ్‌నెస్ వచ్చింది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
తీర్పు:
‘ప్రేమ కావాలి’.. ‘లవ్‌లీ’ తర్వాత ఆది చుట్టాలబ్బాయితో మంచిమార్కులే కొట్టేశాడు. హీరో ఆది నటన,ఫస్టాఫ్ ఎంటర్టైనింగ్, మంచి పంచ్ డైలాగులు, టైమింగ్ తో సాగే 30 ఇయర్స్ పృథ్వి కామెడీ ఈ చిత్రంలో మెచ్చుకోదగ్గ అంశాలు. పాత కథ, సెకెండ్ హాఫ్ కథనం ఇందులో నిరుత్సాహపరిచే విషయాలు. మొత్తంగా ‘చుట్టాలబ్బాయ్’ టైంపాస్ మూవీ.
విడుదల తేదీ:19/08/2016
రేటింగ్:2.5/5
నటీనటులు:ఆది,నమితా ప్రమోద్
సంగీతం: ఎస్.తమన్
నిర్మాతలు: రామ్ తలారి.. వెంకట్ తాళ్లూరి
దర్శకత్వం: వీరభద్రమ్