చిరంజీవి నలభయ్యేళ్ల వేడుకని నేనే నిర్వహిస్తా..

309
chiranjeevi
chiranjeevi
- Advertisement -

చిరంజీవి నా ఆత్మీయుడు. నా జీవితంలో కానీ, అతని జీవితంలో కానీ ఎవరికెవరూ చెడు చేసుకోలేదు. ఆ కుటుంబం కూడా క్షేమంగా ఉండాలని కోరుకొంటా.. చిరంజీవి నలభయ్యేళ్ల వేడుకని నా ఆధ్వర్యంలో తిరుపతిలో నిర్వహిస్తా.. నవరస నట తిలకం మోహన్ బాబు అన్న మాటలివి. శనివారం రాత్రి విశాఖపట్నంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో నటుడు మోహన్‌బాబు 40 వసంతాల సినీ ప్రస్థానాన్ని పురస్కరించుకుని టి.సుబ్బరామిరెడ్డి లలిత కళపరిషత్‌ ఆధ్వర్యంలో ఘన సన్మానం జరిగింది. మోహన్‌బాబుకు టి.ఎస్‌.ఆర్‌. లలిత కళా పరిషత్‌ తరపున టి.సుబ్బరామిరెడ్డి ‘నవరస నట తిలకం’ బిరుదును ప్రదానం చేశారు. మోహన్‌బాబుకు చిరంజీవి స్వర్ణ కంకణాన్ని బహుకరించారు. మోహన్‌బాబు ఫొటో పుస్తకాన్ని శ్రీదేవి ఆవిష్కరించారు. పెదరాయుడు చిత్ర ఫొటోల పుస్తకాన్ని సినీనటుడు వెంకటేశ్‌, రాఘవేంద్రరావు తదితరులు ఆవిష్కరించారు.

ముఖ్య అతిథిగా హాజరైన కురియన్‌ మాట్లాడుతూ సినీ పరిశ్రమలో 40 సంవత్సరాలు విజయవంతంగా పూర్తి చేసుకోవడం అసామాన్య విషయమన్నారు. మోహన్‌బాబు మరో 40 సంవత్సరాలు విజయవంతంగా చిత్ర సీమలో రాణిస్తారని ఆకాంక్షించారు. తెలుగు సినీ పరిశ్రమలో దమ్మున్న నటుడు మోహన్‌బాబు అని పేర్కొన్నారు.

చిరంజీవి మాట్లాడుతూ….నాకు అత్యంత ఆప్తుడు, నా మిత్రుడు, నా మనసుకు దగ్గరైన వ్యక్తి మోహన్ బాబు. ఈరోజు జరుగుతున్న సన్మానం మోహన్‌బాబుకి కాదు. ఓ క్రమశిక్షణకు, కష్టానికి, అనుకున్నది సాధించగలననే పట్టుదలకు జరుగుతోంది. మోహన్‌బాబు 1975లో, నేను 1978లో చిత్రసీమలో ప్రవేశించాం. మా ఈ ప్రయాణంలో మోహన్‌బాబు అలుపెరగక ఎందరికో స్ఫూర్తిప్రదాతగా నిలిచాడు. ఇండస్ట్రీకి రావడం పూల పాన్పు కాదు, ముళ్లబాట. ఏ రోజు అవకాశం వస్తే ఆ రోజు సద్వినియోగం చేసుకున్నాడు. డైలాగులు చెప్పడంలో తనకు తిరుగు లేదు. నటనలో తన కీర్తి ప్రతిష్ఠలకు ఎదురులేదు. మేమిద్దరం ఎప్పుడూ స్నేహితులమే. మోహన్‌బాబు ప్రేమ రాక్షస ప్రేమ. మా ఇద్దరి మధ్య పొరపచ్ఛాలు ఉన్నట్టుగా, మేమేదో టామ్‌ అండ్‌ జెర్రీ అన్నట్లుగా ప్రచారం జరుగుతుంటుంది. మా మనసుల్లో అలాంటిదేమీ ఉండదన్నారు.

దాసరి నారాయణరావు మాట్లాడుతూ ‘‘చరిత్రలో నిలిచిపోయే కార్యక్రమిది. మోహన్‌బాబు నలభయ్యేళ్ల సుదీర్ఘ చరిత్రకి సన్మానం చేశారు. ఒక మనిషి ఒక సామాన్యుడు అనుకొంటే ఏ స్థాయికి చేరుతాడో చెప్పడానికే ఈ వేడుక. ఇవాళ వస్తున్న తరం చూస్తుంటే ఐదేళ్లకే అలసిపోతున్నారు. పదేళ్లు చాలనుకొంటున్నారు. ఈ వేదిక మీద కూర్చున్న వాళ్లల్లో సుదీర్ఘమైన చరిత్ర ఉన్నవాళ్లే ఉన్నారు. మనిషి ప్రతిభ అనేది రెండోది, క్రమశిక్షణే మొదటిది. పరిశ్రమలో ఎక్కువకాలం నిలబడ్డవాళ్లంతా కృషితో పైకొచ్చినవాళ్లే. ఇలాంటి వేడుకల్ని టి.సుబ్బరామిరెడ్డి్డలాంటి వాళ్లు చేయకపోతే కళాకారుల గొప్పతనం ఎలా తెలుస్తుంది? మోహన్‌బాబుని నేనే పరిచయం చేశా. కేవలం పరిచయం చేసినంత మాత్రానో, నాలుగు సినిమాలు ఇచ్చినంత మాత్రానో ఒకరు ఎదగరు. ఏ క్రమశిక్షణనైతే నమ్మాడో అదే మోహన్‌బాబుని చరిత్రకారుడిని చేసింది. మోహన్‌బాబు వ్యక్తిత్వం విలక్షణమైనది. అతను ఎదుటివారిని మనస్ఫూర్తిగా ప్రేమిస్తాడు. నాకు తెలిసి పరిశ్రమలో మోహన్‌బాబుతోనే ఎక్కువ మంది స్నేహం చేస్తారు. మోహన్‌బాబు నలభయ్యేళ్ల నట ప్రయాణం పూర్తి చేసుకోవడమనేది అతని పరిచయం చేసిన ఒక గురువుగా నా కంటే ఆనందపడేవాడు మరొకడు ఉండడ’’న్నారు.
వెంకటేష్‌ మాట్లాడుతూ ‘‘మోహన్‌బాబుగారు నలభయ్యేళ్ల సినీ ప్రయాణాన్ని పూర్తి చేసుకోవడం సంతోషకరం. నలభయ్యేళ్లలో చాలామంది చాలా సంపాదిస్తారు. చిత్తశుద్ధిగల నటుడైన మోహన్‌బాబుగారు ప్రేక్షకుల నుంచి, పరిశ్రమ నుంచి ప్రేమ, ఆప్యాయతల్ని సంపాదించారు’’ అన్నారు.
సురేష్‌బాబు మాట్లాడుతూ‘‘మాకుటుంబానికి దగ్గరి వ్యక్తులు సుబ్బరామిరెడ్డి, మోహన్‌బాబు. సుబ్బరామిరెడ్డి పుట్టినరోజున మోహన్‌బాబుగారి నలభయ్యేళ్ల ప్రయాణానికి సంబంధించిన వేడుక జరగడం సంతోషం. మోహన్‌బాబుగారు మా సురేష్‌ ప్రొడక్షన్స్‌లోనూ సినిమాలు చేశారు. ‘నా రూటే వేరు’ అని మా సినిమాలోనే చెప్పారాయన. మరో నలభయ్యేళ్లు ఆయన ఇలాగే విజయవంతంగా ప్రయాణం చేయాల’’న్నారు.

కె.రాఘవేంద్రరావు మాట్లాడుతూ ‘‘సుబ్బరామిరెడ్డిగారు ఏటా తన పుట్టిన రోజునాడు కళాకారుల్ని సత్కరించడం గొప్ప విషయం. ఒక వ్యక్తి గొప్ప స్థాయికి చేరుకోవడానికి చాలా కారణాలుంటాయి. మోహన్‌బాబు అందరు హీరోలు చేసిన అన్నిరకాల పాత్రల్నీ చేశారు. మోహన్‌బాబు వేసిన కొన్ని వేషాల్ని అందరు హీరోలు వేయలేరు, వేసినా ఒప్పించలేరు. మోహన్‌బాబు రూటే వేరు. ఆయననీ ఆయన కుటుంబాన్నీ దేవుడు కరుణతో చూడాలని కోరుకొంటున్నా’’ అన్నారు.

టి.సుబ్బరామిరెడ్డి మాట్లాడుతూ ‘‘ప్రయాణం ప్రారంభించి నలభయ్యేళ్లయినా వన్నెతగ్గని నటుడిగా కొనసాగుతున్నాడు మోహన్‌బాబు. మంచి హృదయమున్నవాడు. మరో నలభయ్యేళ్లు నటుడిగా ఇలాగే కొనసాగాలని, ఆరోగ్యంగా ఉండాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నా’’ అన్నారు.

మోహన్‌బాబు మాట్లాడుతూ ‘‘ఈరోజు ఎన్టీఆర్, ఏఎన్నార్, రామానాయుడు గార్లు లేని లోటు నాకు కనిపిస్తోంది. ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌లతో గొప్ప అనుబంధం నాది. నా ఆస్తులు తాకట్టు పెట్టి ‘మేజర్‌ చంద్రకాంత్‌’ తీసి అన్నయ్యా నిన్ను మళ్లీ ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెడతా అన్నా. ఆ ఘనత నాకే దక్కింది. నాది సుదీర్ఘ ప్రయాణం. మారు మూల గ్రామంలో మధ్యతరగతి కుటుంబంలో జన్మించా. మా నాన్న టీచర్. డబ్బుల్లేక ఎక్కువ చదువుకోలేదు. కారు షెడ్డులో, ప్లాట్‌ఫామ్ మీద పడుకుని జీవించిన రోజులున్నాయి. ఆ ప్రయాణంలో మా గురువు దాసరి గారు పరిచయమయ్యారు. జన్మనిచ్చిన తల్లిదండ్రుల తర్వాత 1975లో ‘స్వర్గం-నరకం’ ద్వారా దాసరిగారు నటుడిగా జన్మనిచ్చారు. 500కు పైగా సినిమాల్లో నటించా, 60 సినిమాలు నిర్మించి పార్లమెంటుకి వెళ్లి… ఇలా ఇన్ని సాధించానంటే నా తల్లిదండ్రులు, గురువులు ప్రసాదించిన ఆశీర్వచనాలే. ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొనే ఈ స్థాయికి వచ్చా. నిర్మాతగా నాకు రామానాయుడుగారే స్ఫూర్తి. సినిమాల జయాపజయాలతో సంబంధం లేకుండా ఎవరికి ఇస్తానన్న పారితోషికం వారికి కచ్చితంగా ఇచ్చే పరిస్థితిలో ఉన్నప్పుడే నిర్మాతగా సినిమా చేయమని చెప్పారు. నా తొలి చిత్రం ‘ప్రతిజ్ఞ’ నుంచి అలాగే చేస్తున్నా. శ్రీదేవి, జయసుధ, జయప్రదలతోపాటు, నా దర్శకులు రచయితలు, నా చిత్రాలకి పాటలు పాడిన ఏసుదాస్‌గారు ఈ వేదికపై ఉండడం ఆనందంగా ఉంది. క్రమశిక్షణ దీక్ష పట్టుదల ఉండబట్టే ఇక్కడిదాకా చేరుకొన్నా. డైలాగు ఎలా చెప్పాలి? ఎక్కడ నొక్కాలి? అని కాలితోతన్ని నాకు నేర్పించారు దాసరి నారాయణరావు. వారి ఆశీర్వాదమే నన్ను ఇక్కడిదాకా తీసుకొచ్చింది. పూర్వకాలంలో జమిందారులు, రాజులు మాత్రమే కళాకారులకి సన్మానం చేసేవాళ్లు. ఈ కాలంలో అలాంటి వ్యక్తే సుబ్బరామిరెడ్డిగారు. నలభయ్యేళ్లలో ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌తోపాటు ఉత్తరాదికి చెందిన ఎంతోమంది నటీనటుల్ని సన్మానించారు. ఆయన లేకపోతే కళాకారుల్ని సన్మానించేవాళ్లు ఒక్కరూ ఉండరు. చిరంజీవి నలభయ్యేళ్ల వేడుకని నా ఆధ్వర్యంలో తిరుపతిలో నిర్వహిస్తా’’ అన్నారు.

mohan Celebrations (22)
కార్యక్రమంలో అల్లు అరవింద్‌, నాగబాబు, మంచు విష్ణు, మంచు మనోజ్‌, సునీల్‌, రాజ్‌తరుణ్‌, నిఖిల్‌, సాయిధరమ్‌ తేజ్‌, అల్లు శిరీష్‌, ప్రగ్యా జైశ్వాల్‌, ఛార్మి, బి.గోపాల్‌, పరుచూరి గోపాలకృష్ణ, వందేమాతరం శ్రీనివాస్‌, వరప్రసాద్‌రెడ్డి అలీ, రఘుబాబు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -