బాలకృష్ణ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో భవ్య క్రియేషన్స్ పతాకంపై వి. ఆనందప్రసాద్ నిర్మించిన సినిమా ‘పైసా వసూల్’. ఈ మూవీ పాటల విడుదల కార్యక్రమం ఖమ్మంలో అభిమానుల సమక్షంలో భారీ ఎత్తున జరిగింది. ఈ కార్యక్రమంలో హీరో బాలకృష్ణ మాట్లాడుతూ పైసా వసూల్ చిత్రం ఘన విజయం సాధిస్తుందని అన్నారు. మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ సినిమాకు మంచి మ్యూజిక్ ను అందించారని అన్నారు. అభిమానులే తమ సినిమాలకు బలం అని వారు లేకపోతే తాము లేమని అన్నారు.
ఆడియో రిలీజ్ ఫంక్షన్ జరుగుతుండగా భారీ వర్షం కురిసింది. దీంతో కార్యక్రమం ముందుకు సాగకపోవచ్చని ఒక దశలో అనిపించింది. అయితే ఆశ్చర్యకరంగా కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలివచ్చిన అభిమానుల్లో ఒక్కరూ వెనక్కు పోలేదు. ఫ్యాన్స్ అంతా తడుస్తూ కూడా గ్రౌండ్‌లోనే ఉండి బాలయ్యపై అభిమానం చాటుకున్నారు. ఆడియో ఫంక్షన్ కార్యక్రమం విజయవంతం అవడంపై చిత్ర యూనిట్ హర్షం వ్యక్తం చేసింది. ఆడియో ఫంక్షన్‌కి హైదరాబాద్ నుంచి హీరో బాలకృష్ణ, పూరీ జగన్నాథ్, క్రిష్, బోయపాటి, హీరోయిన్లు ఛార్మి, శ్రియా, కైరా దత్, ముస్కాన్ తదితరులు పాల్గొన్నారు. భారీ వర్షం పడినా అభిమానులెవ్వరూ కదలకుండా కార్యక్రమం పూర్తయ్యేదాకా ఉండటంతో బాలయ్య తన్మయులయ్యారు. అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో మాట్లాడిన ప్రతి ఒక్కరు కూడా ఫ్యాన్స్ అభిమానాన్ని ప్రత్యేకంగా ప్రశంసించారు.
అయితే ఉదయం నుండి వేదిక వద్దకు బాలయ్య అభిమానులు భారీ స్థాయిలో చేరుకోవడంతో ఖమ్మం పట్టణం కోలాహలంగా మారింది. ఇక పైసా వసూల్ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందించగా.. సెప్టెంబర్1 ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది.