తెలంగాణ ఏర్పడదని ఆనాడు టీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఉద్యమాన్ని వదిలేస్తే రాష్ట్రం వచ్చేదే కాదని వైసీపీ అధినేత జగన్ అన్నారు. ప్రత్యేక హోదా అంశంపై సభలో చర్చించాలని వైసీపీ ఎమ్మెల్యేలు పట్టుబట్టారు. ఈ సందర్బంగా మార్షల్స్,వైసీపీ సభ్యుల మద్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడిన జగన్ ఉద్యమాలతో సాధించలేనిదంటూ ఏదీ లేదు అని వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అన్నారు. ఉద్యమాలతో తెలంగాణ రాష్ట్రమే వచ్చినపుడు.. ప్రత్యేక హోదాపై పార్లమెంట్‌లో ఇచ్చిన హామీ కోసం పోరాడితే తప్పకుండా వస్తుందని అన్నారు.
ప్రత్యేక హోదా అంశంపై మూడో రోజు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ దద్దరిల్లింది. ప్రత్యేక హోదాపై చర్చ చేపట్టాలంటూ స్పీకర్ పోడియాన్ని ప్రతిపక్ష వైసీపీ సభ్యులు చుట్టుముట్టి సభాకార్యక్రమాలను అడ్డుకున్నారు. దీంతో సభలో అధికార,ప్రతిపక్ష సభ్యుల మాటలయుద్ధం నెలకొంది. వైసీపీ సభ్యులను సస్పెండ్ చేయాలని టీడీపీ సభ్యులు డిమాండ్ చేశారు.మరోవైపు జగన్ తీరును స్పీకర్ కోడెల తప్పుబట్టారు. మీడియా పాయింట్ వద్ద సేమ్ సీన్ రిపీటైంది. వైసీపీ,టీడీపీ సభ్యుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఒకరినొకరు తోసుకోవడంతో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది.
మరోవైపు ఏపీ బంద్ నేపథ్యంలో ఆర్టీసీ డిపోల ముందు ధర్నా చేస్తున్న పలువురు నేతలను అరెస్ట్ చేశారు. కడపలో ఆందోళన చేస్తున్న వైసీపీ నేతలను అరెస్ట్ చేశారు. కడప జిల్లా వ్యాప్తంగా డిపోలో 930 బస్సులు నిలిచిపోయాయి. మాజీ ఎమ్మెల్యేభూమన కరుణాకర్‌రెడ్డి సహా పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు. చిత్తూరులో వైసీపీ నేతలను అరెస్ట్ చేశారు. జిల్లాల్లో పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. బంద్ కారణంగా ఎస్వీ యూనివర్సిటీ దూరవిద్య పరీక్షలు రద్దు చేశారు.
ఇక ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నేటితో ముగియనున్నాయి.