టాలీవుడ్‌లో టాలెంటెడ్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న నవీన్ పోలిశెట్టి ప్రధాన పాత్రలో తెరకెక్కిన తాజా చిత్రం ‘అనగనగా ఒక రాజు’ థియేటర్లలో ఘన విజయం సాధించింది. దర్శకుడు మారి రూపొందించిన ఈ సినిమాలో లేటెస్ట్ బ్యూటీ మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటించగా, అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకులను ఆకట్టుకుంది. నవీన్ పోలిశెట్టి టైమింగ్ కామెడీ, సహజమైన నటన, వినోదభరితమైన డైలాగ్స్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. కుటుంబ ప్రేక్షకులను అలరించే సన్నివేశాలు సినిమా మొత్తాన్ని సరదాగా ముందుకు నడిపించాయి.
సంక్రాంతి పండుగ సెలవుల సమయంలో విడుదల కావడంతో థియేటర్లలో ఈ చిత్రానికి మంచి ఆడియన్స్ టర్నౌట్ కనిపించింది. కుటుంబాలతో కలిసి సినిమా చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తి చూపడంతో బాక్సాఫీస్ వద్ద కూడా ఆశించిన స్థాయిలో వసూళ్లు నమోదయ్యాయి. మేకర్స్ ప్రకటించిన వివరాల ప్రకారం, ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించి సూపర్ హిట్‌గా నిలిచింది.
కామెడీతో పాటు గ్రామీణ రాజకీయాల నేపథ్యంలో వచ్చే వ్యంగ్య సన్నివేశాలు, ఎమోషనల్ టచ్ కూడా ప్రేక్షకులను మెప్పించాయి. థియేట్రికల్ రన్ విజయవంతంగా ముగించుకున్న ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. తాజా సమాచారం ప్రకారం ఫిబ్రవరి 11 లేదా 13 తేదీల్లో స్ట్రీమింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుంది.
థియేటర్లలో మంచి స్పందన అందుకున్న ‘అనగనగా ఒక రాజు’ సినిమా ఓటీటీలో కూడా అదే స్థాయిలో ప్రేక్షకులను అలరించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. నవీన్ పోలిశెట్టి కామెడీకి ఉన్న ప్రత్యేక ఫ్యాన్ బేస్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ కావడం వల్ల డిజిటల్ ప్రేక్షకుల నుంచి కూడా మంచి ఆదరణ దక్కనుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
Also Read:KTR:ప్రజల గుండెల్లో కేసీఆర్ ధ్రువతార

