ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేం

230
ap
ap
- Advertisement -

14వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు దేశంలోని ఏ రాష్ర్టానికీ ప్రత్యేక హోదా ఇచ్చే పరిస్థితి లేదని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ స్పష్టంచేశారు. బుధవారం రాత్రి బాగా పొద్దుపోయిన తర్వాత అరుణ్‌జైట్లీ విలేకరులతో మాట్లాడారు. ప్రత్యేక హోదా స్థానంలో వెలుపలినుంచి మద్దతు అందించే ప్రాజెక్టుల ద్వారా ప్రత్యేక సహాయం అందిస్తామని ప్రకటించారు. ఆనాటి ప్రధాని మన్మోహన్‌సింగ్ ఇచ్చిన హామీలన్నీ దీని ద్వారా నెరవేరుతాయని చెప్పారు. ఈ సహకారం ఐదేండ్లపాటు అంటే.. 2020 వరకూ కొనసాగుతుందని తెలిపారు. ప్రత్యేక హోదా ఇవ్వలేని పక్షంలో ప్రత్యేక ప్యాకేజీ ఇస్తారని భావించినా.. జైట్లీ నోటి వెంట ప్యాకేజీ అనే పదం కూడా రాకపోవడం విశేషం.విభజనద్వారా కొత్తగా ఏర్పడిన ఏపీ అభివృద్ధి సాధించాలన్నదే తమ అభిమతమని పేర్కొన్నారు. పునర్వ్యవస్థీకరణ వల్ల అవశేష ఆంధ్రప్రదేశ్ ఆదాయాన్ని కోల్పోయిందని, ఆ నష్టాన్ని భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు.

2014-15 ఆర్థిక సంవత్సరానికి రెవెన్యూ లోటు కింద రూ.3975 కోట్లు ఇచ్చామని, మిగిలినది దశలవారీగా ఇస్తామని చెప్పారు. ఏపీ విభజన చట్టంలోని అంశాలను తు.చ. తప్పకుండా అమలు చేస్తామని ఆయన స్పష్టంచేశారు. కేంద్రం ఏపీకి అందించే సాయంపై పూర్తి వివరాలను గురువారం ఆర్థికశాఖ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేస్తామని తెలిపారు. ఏపీకి సంబంధించిన అనేక అంశాలపై చర్చించామని, ఏపీ పునర్విభజన చట్టం, 14వ ఆర్థిక సంఘం సిఫార్సులను పరిగణనలోకి తీసుకున్నామని ఆయన తెలిపారు. పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించామని, దీనిని పూర్తి చేసేందుకు కేంద్రం వందశాతం నిధులు ఇస్తుందని తెలిపారు. 2014 ఏప్రిల్ 1 తర్వాత ఈ ప్రాజెక్టుపై పెట్టిన వ్యయం మొత్తాన్ని కేంద్రమే భరిస్తుందని చెప్పారు. ఈ ప్రాజెక్టు పూర్తికి రూ.28వేల కోట్లు అవసరమవుతాయని అంచనా.

ఇదేకాకుండా కేంద్ర ఆర్థిక సంఘం సిఫార్సు మేరకు కేంద్ర పన్నుల్లో 42శాతం వాటా ఇవ్వడంతోపాటు రెవెన్యూ లోటును చట్ట ప్రకారం వందశాతం కేంద్రం భర్తీ చేస్తుందని జైట్లీ ప్రకటించారు. ఇప్పటికే ఏపీ కొత్త రాజధాని అమరావతి నిర్మాణానికి రూ.2500 కోట్లు ఇచ్చామని, వెనుకబడిన జిల్లాల నిధుల కింద 1500 కోట్లు ఇచ్చామని చెప్పారు. బెంగళూరు చైన్నై, విశాఖ-చెన్నై పారిశ్రామిక క్యారిడార్‌కు 12వేల కోట్లు ఇచ్చామని తెలిపారు. రెవెన్యూ లోటుపై ఏపీ ప్రభుత్వం, నీతి ఆయోగ్ చర్చించి ఒక నిర్ణయానికి వస్తాయని జైట్లీ తెలిపారు. ప్రత్యేక హోదాతో సమానంగా ప్యాకేజీ ఉంటుందని చెప్పారు. రెండు పన్ను మినహాయింపులు ఏపీకి ఉంటాయని, దీనిని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు త్వరలోనే నోటిఫై చేస్తుందని చెప్పారు. కడపలో ఉక్కు కర్మాగారానికి సంబంధించి సాధాసాధ్యాల నివేదికను పరిశీలించి నిర్ణయం తీసుకుంటామన్నారు.

వెంకయ్య మాట్లాడుతూ.. ‘ఏపీని ప్రత్యేక రాష్ట్రంగా పరిగణిస్తాం.. కేంద్రం నుంచి అన్ని విధాలుగా సాయాన్ని అందిస్తాం. ఇప్పటికే అనేక ప్రాజెక్టులు, విద్యాసంస్థలు మంజూరు అయ్యాయి. అవి పనిచేస్తున్నాయి. మిగిలిన గిరిజన వర్సిటీ, కడప స్టీల్ ప్లాంట్ వీటి ఏర్పాటుపై కూడా ఒక టాస్క్‌ఫోర్స్‌ను నియమించాం. ఏపీకి కేంద్ర సాయం చేయడం అనేది నిరంతర ప్రక్రియ.  ఏపీని విభజించిన తీరు వల్ల కేంద్ర సాయం అత్యవసరమని అన్నారు.  మిగిలిన రాష్ర్టాల స్థాయికి ఏపీ చేరే దాకా కేంద్ర చేయూతనందిస్తుందన్నారు.  ప్రత్యేక శ్రద్ధతో ఏపీలో అన్ని కార్యక్రమాలనూ అమలు చేస్తున్నదని, విభజన చట్టంలో పేర్కొన్న విద్యాసంస్థలను అనుకున్న సమయానికన్నా ముందే ఏర్పాటు చేస్తామన్నారు. సమావేశంలో కేంద్ర మంత్రి, టీడీపీ నేత సుజనాచౌదరి కూడా పాల్గొన్నారు.

- Advertisement -