ఎయిర్‌టెల్‌కు జియో ఝలక్..

560
Mukesh-Ambani
Mukesh-Ambani
- Advertisement -

టెలికం మార్కెట్లో పెను సంచలనానికి రిలయన్స్ జియో తెరతీసింది. ఇప్పటి వరకు కొందరికే పరిమితమైన జియో ప్రివ్యూ ఆఫర్ ఇక నుంచి అందరికీ అందుబాటులోకి వచ్చింది. 4జీ స్మార్ట్‌ఫోన్ ఉన్న కస్టమర్లు ఎవరైనా జియో సిమ్‌ను ఉచితంగా తీసుకోవచ్చు. 90 రోజులపాటు అపరిమితంగా జియో సేవలను ఉచితంగా పొందవచ్చు. దేశవ్యాప్తంగా అన్ని నగరాల్లోనూ ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. ముకేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జియో వాణిజ్యపర కార్యకలాపాలను ఇంకా ప్రకటించక ముందే తీసుకున్న తాజా నిర్ణయం టెలికం మార్కెట్‌ను షేక్ చేయనుంది.

తాజాగా ‘జియో’ ఫోన్లే వాడాలని తమ ఉద్యోగులకు రిలయన్స్ ఆదేశాలు జారీ చేసింది. ఆర్‌ఐఎల్‌కు 40,000 మందికి పైగా ఉద్యోగులుండగా, వీరంతా సంస్థ ఆదేశాలను పాటించాల్సి ఉంటుంది.కార్పొరేట్‌ కనెక్షన్లు అన్నింటినీ జియోకు మారుస్తున్నట్లు ఆర్‌ఐఎల్‌ మానవ వనరుల విభాగం నుంచి ఉద్యోగులందరికీ లేఖలు చేరాయి. ఇతర నెట్‌వర్క్‌ల నుంచి జియోకు తమ మొబైల్‌ నెంబర్లను ఎంఎన్‌పీ ద్వారా మార్చుకునేందుకు ఏం చేయాలో కూడా వివరించింది. కోరిన సమాచారం అంతా ఇవ్వగానే, ప్రస్తుత ఆపరేటర్‌ నుంచి జియోకు నెంబరును మార్చేందుకు (ఎంఎన్‌పీ) అవసరమైన ప్రక్రియను ప్రారంభిస్తామని తెలిపింది. ఇది పూర్తయ్యేందుకు 7 పనిదినాలు అవసరమవుతాయని పేర్కొంది. ఇప్పటివరకు కార్పొరేట్‌ కనెక్షన్లన్నీ ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ నెట్‌వర్క్‌లవే.

ఇతర మొబైల్‌ నెట్‌వర్క్‌ కనెక్షన్లను వినియోగించడం మాని, అత్యధిక వేగం డేటా బదిలీ, అత్యంత స్పష్టంగా మాటలు వినిపించే రిలయన్స్‌ జియో 4జీ కనెక్షన్లు వాడుకోవాలని తమ సిబ్బందిని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ (ఆర్‌ఐఎల్‌) ఆదేశించింది. ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ వంటి నెట్‌వర్క్‌ల నుంచి తమ నెంబర్లను రిలయన్స్‌ జియోకు మొబైల్‌ నెంబరు పోర్టబులిటీ (ఎంఎన్‌పీ) ద్వారా బదిలీ చేయించుకోవాలని కోరింది. కాగా, జియోకు 15 లక్షల మంది టెస్ట్ యూజర్లు ఉన్నారని రిల్ చైర్మన్ ముకేశ్ అంబానీ తెలిపారు. దేశవ్యాప్తంగా 22 సర్వీస్ ఏరియాల ద్వారా 18వేల పట్టణాలు, 2 లక్షలకుపైగా గ్రామాల్లో జియో సేవలు అందించనున్నట్టు వెల్లడించారు.

- Advertisement -