2016వ సంవత్సరపు సూపర్ ఫోన్‌గా ఐఫోన్ 7 రంగప్రవేశం చేసింది. శానిఫ్రాన్సిస్కోలోని గ్రహం బిల్ సివిక్ ఆడిటోరియం వేదికగా అట్టహాసంగా విడుదలైన ఐఫోన్7, ఐఫోన్7 ప్లస్లు త్వరలోనే భారత్లోకి ప్రవేశించనున్నాయట. అక్టోబర్ 7 నుంచి ఐఫోన్7, ఐఫోన్ 7 ప్లస్ అమ్మకాలను భారత్లో చేపడతామని యాపిల్ ప్రకటించింది. మిగతా ఐఫోన్ల కంటే చౌకైన ధరలోనే ఈ ఫోన్లు భారత్లో లభ్యంకానున్నట్టు తెలిపింది. ధర రూ.60,000(32జీబీ మోడల్) నుంచి ప్రారంభంకాబోతుందని వెల్లడించింది. సిల్వర్, రోజ్ గోల్డ్ , బ్లాక్, జెట్ బ్లాక్ రంగుల్లో 32జీబీ, 128జీబీ, 256 జీబీ వేరియంట్లలో ఐఫోన్7, ఐఫోన్ 7 ప్లస్లు అందుబాటులోకి వచ్చాయి. రెండో బ్యాచ్ కింద భారత్లో ఈ విక్రయాలు చేపడతామని యాపిల్ మీడియా ప్రకటన ద్వారా నిర్ధారించింది.
మరింత ఎక్కువ బ్యాటరీ కాలం, మెరుగైన కెమేరాలతో ఐఫోన్ 7, ఐఫోన్ 7 ప్లస్‌లతో పాటు ఆపిల్ వాచ్ కొత్త సిరీస్ 2 ను కూడా విడుదల చేశారు. మొబైల్ చరిత్రలోనే మొదటిసారిగా వైర్‌లెస్ హెడ్‌ఫోన్స్‌గా ఎయిర్ పాడ్‌లను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఐఫోన్, ఆపిల్ వాచ్‌తో ఇవి పనిచేస్తాయి. జూన్‌లో జరిగిన డెవలపర్స్ సమావేశంలో ప్రకటించిన కొత్త ఓఎస్‌లను కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని రకాల ఆపిల్ ఉపకరణాలకు డౌన్‌లోడ్‌ను సెప్టెంబర్ 13న ప్రారంభిస్తున్నట్లు కుక్ తెలిపారు. ఇందులో ఐఓఎస్ 10, వాచ్‌ఓఎస్ 3, మ్యాక్ ఓఎస్ సియోరా ఉన్నాయి..
ఫోన్ 7, 7 ప్లస్ ప్రత్యేకతలివే..
* 12, 7 ఎమ్‌పీ కెమేరాలు: వెనక వైపు 12 ఎంపీ కెమేరా సహాయంతో 4కే రెసొల్యూషన్‌లో వీడియోలను రికార్డు చేయొచ్చు. 12 ఎంపీ సెన్సార్ 60 శాతం అధిక వేగంగా పనిచేస్తుంది. ముందు వైపు 7 ఎమ్‌పీ ఫేస్‌టైమ్ హెచ్‌డీ కెమేరా ఉంటుంది.(ఐఫోన్ 6ఎస్‌లో ఇది 5 ఎంపీగా ఉంది.)
* స్టీరియో స్పీకర్లు: తొలి సారిగా ఐఫోన్‌లో స్టీరియో స్పీకర్లను ఏర్పాటు చేశారు. కొత్త ఫోన్లలోని స్టీరియో స్పీకర్లు ఉండడంతో సినిమా వీక్షణ అనుభవం సరికొత్తగా ఉండే అవకాశం ఉంది.
* కొత్తగా ముదురు నలుపు(జెట్ బ్లాక్) జత కలిసింది. ఇప్పటికే సిల్వర్, గోల్డ్, రోజ్ గోల్డ్ రంగుల్లో యాపిల్ ఫోన్లు వస్తున్న సంగతి తెలిసిందే.
* కొత్త చిప్: ప్రస్తుత ఏ9 చిప్ స్థానంలో ఏ10ను తీసుకువచ్చి మరింత వేగవంతమైన ప్రాసెసింగ్‌ను తీసుకువచ్చింది. హోమ్ బటన్ కూడా కొత్తగా తీసుకువచ్చింది.
* డ్యూయల్ లెన్స్ కెమేరా: ఐఫోన్ 7 ప్లస్‌లో మాత్రమే ఈ సదుపాయం ఉంది. దీని వల్ల డీఎస్‌ఎల్‌ఆర్ నాణ్యత వస్తుందని కంపెనీ చెబుతోంది. ఇప్పటిదాకా వచ్చిన ఐఫోన్లలో ఇదే అత్యుత్తమ కెమేరా అని అంటోంది.
* నీరు, దుమ్ము, ధూళి ఏం చేయలేవు: నీటిలో పడ్డా ఈ కొత్త ఫోన్లు చెడిపోవు. ఐపీ67 ప్రొటెక్షన్‌తో వచ్చిన ఈ ఫోన్ అరగంట పాటు మీటరు లోతు నీళ్లలో పడ్డా ఈ కొత్త ఫోన్లకు వచ్చిన ఇబ్బందేమీ లేదు. దుమ్ము పడ్డా ఇది పనిచేయడం మానదు.
* సూపర్ మారియో: కొత్త ఐఫోన్లతో సూపర్ మారియో గేమ్ రానుంది.
* బ్యాటరీ: ఐఫోన్ 6ఎస్‌తో పోలిస్తే ఐఫోన్ 7.. రెండు గంటలు అధికంగా; ఐఫోన్ 6ఎస్ ప్లస్‌తో పోలిస్తే ఐఫోన్ 7 ప్లస్.. గంట అధికంగా బ్యాటరీ జీవితాన్ని కలిగి ఉంటుంది.
* ఇయర్ పాడ్స్: ఆడియో జాక్‌కు బదులుగా లైటెనింగ్ కనెక్టర్లతో ఇయర్‌పాడ్‌లను ఐఫోన్ 7, 7ప్లస్‌లకు జతచేసింది. 3.5ఎంఎం హెడ్ ఫోన్ జాక్ అడాప్టర్ ద్వారా పాత హెడ్‌ఫోన్లను ఉపయోగించుకోవచ్చు.
* ఐఫోన్ 7 తెర పరిమాణం 4.7 అంగుళాలు.
* యాపిల్ ఆపరేటింగ్ సిస్టమ్ అయిన ఐఓఎస్ 10 సెప్టెంబరు 13 నుంచి లభ్యమవుతుంది.
అమెరికా ప్రభుత్వంతో ఇటీవల జరిగిన ఐఫోన్ అన్‌లాకింగ్ యుద్ధాన్ని దృష్టిలో ఉంచుకుని, ఈసారి మరిన్ని సెక్యూరిటీ ఫీచర్లను అదనంగా పొందుపరిచినట్లు కుక్ తెలిపారు. మరింత అభివృద్ధిపరిచిన 3డి టచ్, మల్టీ ఫింగర్ సపోర్ట్‌తో, కృత్రిమ మేధస్సుతో పనిచేసే సిరిని ఇంకా ముందుకు తీసుకెళ్లి మన కొత్త వాచ్ సిరీస్ 2ను విడుదల చేసిన ఇంతకుముందు ఉన్న వాచ్‌కంటే చాలా అభివృద్ధి పరిచింది. ఇదికూడా వాటర్‌ప్రూఫ్‌గా తయారుచేయబడింది. మొదటిసారిగా వాచ్‌లో బిల్టిన్ జీపీఎస్‌ను కూడా ప్రవేశపెట్టారు. వాచ్ ఓఎస్ 3తో పనిచేసే ఈ వాచ్‌లో చాలా యాప్స్ కొత్త కొత్త ఫీచర్లతో తయారుచేయబడ్డాయి. ఈ వాచ్ ధర 369 డాలర్లు (దాదాపు 24,500 రూ.)గా నిర్ణయించారు.