నాగార్జునకు సవాల్ విసిరిన ఎంపీ సంతోష్ కుమార్

169
joginpallysanthosh

గత కొద్ది రోజుల క్రితం కేంద్ర క్రీడల మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాధోడ్ ప్రారంభించిన ఫిట్‌నెస్‌కు చాలెంజ్‌ దేశ వ్యాప్తంగా సోషల్‌ మీడియాలో ఎంత పాపులర్ అయిందో అందరికీ తెలిసిందే. రాజకీయ నాయకులతో పాటు సినీతారలు కూడా ఈ ఫిట్‌నెస్‌ చాలెంజ్‌ను స్వీకరించి తమ వర్క్‌ ఔట్‌కు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా తెలంగాణలో కూడా మరో ఛాలెంజ్‌ వైరల్‌ గా మారింది. దానిపేరే గ్రీన్‌ ఛాలెంజ్‌..

mp santhosh kumar

రాజకీయ నాయకుల నుంచి మొదలుకొని సినీ తారలు, వ్యాపారవేత్తలు, క్రీడాకారులు ఇలా ప్రతి ఒక్కరు మూడు మొక్కల చొప్పున నాటాలని ఈ ఛాలెంజ్‌ ఉద్దేశం. ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా ఈ ఛాలెంజ్‌ ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ గ్రీన్‌ ఛాలెంజ్‌లో భాగంగా ఇప్పటికే టీఆర్‌ఎస్‌ ఎంపీ కవితతో పాటు మంత్రి కేటీఆర్‌, దర్శకుడు రాజమౌళితో పాటు పలువురు మొక్కలను నాటుతూ ఇతరులకు ఛాలెంజ్‌ను విసురుతున్నారు. తాజాగా టీఆర్‌ఎస్‌ రాజ్యసభ సభ్యుడు, టీన్యూస్‌ ఎండీ జోగినపల్లి సంతోష్ కుమార్‌ మొక్కలను నాటారు.

హరితాహారంలో భాగంగా ఎంపీ సంతోష్‌ కుమార్‌కు హోమంత్రి నాయిని నర్సింహారెడ్డి గ్రీన్‌ ఛాలెంజ్‌ ను విసిరారు. ఈ ఛాలెంజ్‌ను స్వీకరించిన ఎంపీ సంతోష్‌ కుమార్‌ ఇవాళ మూడు మొక్కలను నాటారు. మొక్కలను నాటడమే కాకుండా వాటి సంరక్షణకు పూర్తి బాధ్యత తీసుకుంటానని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ సంతోష్‌ కుమార్‌ భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో పాటు, రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌, సినీ నటుడు అక్కినేని నాగార్జునకు గ్రీన్‌ ఛాలెంజ్‌ను విసిరారు. మొత్తానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టి నిర్వహిస్తున్న హరితాహారం కార్యక్రమానికి రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలు గ్రీన్‌ ఛాలెంజ్‌ పేరిట ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు.