హైదరాబాదీలు ఆందోళన వద్దు.. అప్రమత్తంగా ఉన్నాం

72
ktr
ktr

హైదరాబాద్ లో ప్రస్తుతం పరిస్థితి అంతా అదుపులో ఉందని అన్నారు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్. మల్కాజ్ గిరిలో అత్యధిక వర్షపాతం నమోదైందని తెలిపారు. స్కూళ్లకు, కాలేజీలకు సెలవులు ప్రకటించామన్నారు. అన్ని ప్రాంతాల్లో అలర్ట్ గా ఉన్నామని తెలిపారు. నగరంలోని నాలాల ఆక్రమణలపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి కే. తారకరామారావు పేర్కొన్నారు.

Hyderabad

పరిస్థితిని చక్కదిద్దేందుకు జీహెచ్‌ఎంసీ సిబ్బంది తీవ్రంగా కృషి చేస్తున్నారన్నారు. అలాగే ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని, అప్రమత్తంగా ఉండాలని అన్ని విభాగాలను ఆదేశించామని మంత్రి తెలిపారు. అలాగే కొంతమందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామని, హుస్సేన్‌సాగర్‌ లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశామన్నారు. నగరంలో… రోడ్లు ఇబ్బందికరంగా ఉన్న మాట వాస్తవమేనన్నారు. 80శాతం చెరువులు, కుంటలు పూర్తిగా నిండాయని, నాలాల ఆక్రమణలపై కఠిన చర్యలు తీసుకోవడమేగాక నాలాల ఆక్రమణలపై విచారణకు కమిటీ వేస్తామని కేటీఆర్‌ తెలిపారు.

Hyderabad

తెల్లారే వరకు మంత్రులు పద్మారావు, నాయిని, తలసాని, డిప్యూటీ సీఎం కాలనీల్లోనే ఉన్నారు. కుత్బుల్లాపూర్ లో తలసాని, మలక్ పేట్ లో డిప్యూటీ సీఎం, సికింద్రాబాద్ లో పద్మారావు, అల్వాల్ లో నాయిని, ఖైరతాబాద్, నాంపల్లిలలో తాను కాలనీల్లో తిరిగామని చెప్పారు.

ktr

రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు : 
రాష్ట్రవ్యాప్తంగా ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, నల్లగొండ, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో వర్షం భారీగా పడుతుంది. వరద ప్రవాహం పోటెత్తడంతో పలు వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమవగా పలు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. హైదరాబాద్, రంగారెడ్డి, నల్లగొండ, వరంగల్ జిల్లాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు అధికారులు సెలవును ప్రకటించారు. పత్తి, సోయా పంటలు తీవ్రంగా నష్టపోయినట్లు సమాచారం.
ఏజెన్సీలో జోరువానలు పడుతున్నాయి. భూపాలపల్లిలో రాత్రి నుంచి కురుస్తున్న భారీ వానతో ఓపెన్ కాస్ట్ గనుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. చిట్యాల, మెుగుళ్లపల్లి మండలాల్లో భారీ వర్షంతో చలివాగు పొంగిపొర్లుతోంది. మొగుళ్లపల్లి మండలం రాఘవరెడ్డిపేట శివారులోని చలివాగు ఉదృతిలో వంగ మహేశ్ అనే యువకుడు గల్లంతయ్యాడు.

 

జిల్లాలో కరువు ప్రాంతంగా ఉన్న జనగామలో ఈ సీజన్ లో జోరువానలు పడుతున్నాయి. దేవరుప్పల, జనగాం, పాలకుర్తి, స్టేషన్ ఘన్ పూర్ , తొర్రూర్ , కేసముద్రం, గూడూరు మండలాల్లో భారీ వర్షపాతం నమోదైంది. ఈ ప్రాంతంలో 10సెంటిమీటర్లకు పైగా వర్షపాతం నమోదు కాగా, ఒక్క దేవరుప్పలోనే 20, పాలకుర్తి, స్టేషన్ ఘన్ పూర్ లో 15, రఘునాథపల్లి 13, జనగాంలో 10సెంటిమీటర్ల వర్షం కురిసింది.