మట్టి గణనాథులే ముద్దు…

304

వినాయకచవితి ఎన్నో ప్రత్యేకతలు కలిగిన పర్వదినం. విఘ్నాలు తొలగించే వినాయకుణ్ణి భాద్రపద శుద్ధ చవితినాడే కాదు,అన్ని శుభకార్యాల్లో,అన్ని సందర్భాల్లో పూజించడం తరతరాలుగా వస్తున్నసంప్రదాయం. ఇలాంటి సందర్భాల్లో అయితే పసుపు గణపతిని ,సంవత్సరానికి ఒకసారి వినాయక చవితినాడు మట్టి గణపతిని పూజించడం కూడా ఆనవాయితీయే.ఏటా కొన్ని వేల గణపతి విగ్రహాలను రంగు రంగులతో అలంకరించి మండపాల్లో ఏర్పాటుచేయడాన్ని చూస్తుంటాం. అలాగే ప్రతిఇంట్లో వినాయక విగ్రహాన్ని ప్రతిష్టించి పూజ నిర్వహిస్తాం.

ganesh

మన పండగలన్నీ ప్రకృతి ఆరాధనతో మమేకమై వుంటాయి. వినాయకచవితి పర్వదినంలో మనం అనేక పుష్పాలు, ఫలాలతో స్వామిని పూజిస్తాం. గణపతి ఉత్సవాలు నిర్వహించడం ఎంత అవసరమో, పర్యావరణాన్ని కాపాడటం అంత ముఖ్యం.గతంలో మట్టిగణపతి ప్రతిమలనే పూజించేవారు.కాలక్రమంలో భారీవిగ్రహాలను ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌తో ,రంగులు, రసాయినాలు వినియోగించి పోటాపోటీగా తయారు చేస్తున్నారు. కొండంత దేవునికి కొండంత పత్రిని తేలేమన్నది విగ్రహాలకు కూడా వర్తిస్తుంది.భారీ విగ్రహాలను ప్రతిష్ఠించగానే సరికాదు, ఉత్సవాల చివరిరోజున వాటిని నిమజ్జనం చేయడం ఎంత క్లిష్టతరమో భాగ్యనగర వాసులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

అన్ని విగ్రహాలను హుస్సేన్‌ సాగర్‌లోనే నిమజ్జనం చేయాలన్న సెంటిమెంటు వల్ల ఇబ్బందులు అధికమవుతున్నాయి. రసాయినాలు,రంగులతో కూడిన విగ్రహాలను హుస్సేన్‌ సాగర్‌లో నిమజ్జనంచేయడం వల్లపర్యావరణ సమస్యలు నానాటికీ పెరుగుతున్నాయి.

clay-ganapati

పర్యావరణం నుంచి రక్షణ పొందాలన్న భావి తరాలను మంచిని అందించాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ సిద్ధమవ్వాలి. ఈ వినాయకచవితి ఉత్సవాల సందర్భంగా స్వచ్ఛమైన ప్రకృతి కోసం కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఇంట్లో పూజించే చిన్న చిన్న వినాయక విగ్రహాలను పూర్తిగా మట్టితో తయారుచేస్తే అవి పర్యావరణహితంగా వుంటాయి. నీటిలో సులభంగా కరిగిపోతాయి. ఎలాంటి రంగులను వాడకపోవడంతో నీరు కలుషితమయ్యే ప్రమాదం ఉండదు.

Clay-Ganesh-Idols

వినాయక మండపాల్లో ప్లాస్టిక్‌ వినియోగాన్ని పూర్తిగా తగ్గించాలి. మండపాల అలంకరణ, ప్రసాదాల పంపిణీ కోసం రీసైకిల్డ్‌ కాగితం, నూలు వస్త్రంతో చేసిన వస్తువుల్ని వినియోగించాలి. పెద్ద పెద్ద మండపాల వద్ద భారీ పరిమాణం కలిగిన ఆడియో సిస్టమ్‌లను పెట్టి శబ్ద కాలుష్యం కలిగిస్తారు. వీటి స్థానంలో తక్కువ డెసిబెల్స్‌ కలిగిన వాటిని వినియోగించాలి. పెద్ద పెద్ద చెరువులూ,కుంటల్లో వినాయకుడి విగ్రహాలను నిమజ్జనం చేయకూడదు. దీనికి ప్రత్యామ్నాయంగా చిన్న చిన్న కుంటలను తవ్వి అందులో నిమజ్జనం చేయాలి. ఇంట్లోని బావిలో కూడా నిమజ్జనం చేయొచ్చు.

నామ,రూప రహితుడైన భగవంతుణ్ణి మన మనసులో ఈ రూపంలోనైనా ప్రతిష్ఠించుకోవచ్చు.దైవారాధన భక్తుల అంతర్గత వ్యవహారంగా ఉంటేనే దాని పవిత్రత నిలుస్తుంది.దానిని కాపాడుకుంటేనే దైవానుగ్రహం లభిస్తుంది.మనసు ప్రధానం కానీ, మట్టి వినాయకుణ్ణి పూజించినా,పసుపు విఘ్నేశ్వరుణ్ణి పూజించినా ఫలితం ఒక్కటే.మట్టి వినాయకుని పూజలో సహజత్వం,సంతృప్తి ఉంటాయి. తరతరాలుగా మన పూర్వీకులు ఆచరించిన మార్గంలోనే మనం పయనిద్దాం.

clay ganesh sale