బాబుకు చుక్కెదురు..

450

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మెడకు చుట్టుకుంది. ఆడియో టేపులో ఉన్న ఏపీ సీఎం చంద్రాబాబుపై విచారణ జరిపి.. వచ్చేనెల 29వ తేదీలోగా ఈ విచారణ పూర్తి చేయాలని ఏసీబీని ఏసీబీ కోర్టు ఆదేశించింది.

దాదాపు ఏడాది కాలంగా ఈ కేసు ముందుకు సాగడంలేదు. అప్పట్లో స్టీఫెన్‌సన్‌తో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడినట్లుగా చెబుతున్న ఆడియో టేపులు అతికించినవా, వాస్తవమైనవా అనే విషయమై నివేదికను ఫోరెన్సిక్ సైన్సెస్ ల్యాబ్ ఇచ్చింది. అవి అసలైనవే తప్ప అతికించినవి కావని అప్పట్లో ఫోరెన్సిక్ ల్యాబ్ నిర్ధారించింది. దాంతోపాటు ఈ స్వరం చంద్రబాబు నాయుడిదేనని కూడా శాస్త్రీయంగా నిర్ధారించారు. ఇప్పుడు తాజాగా ఫోరెన్సిక్ నివేదిక ఆధారంగా ఓటుకు నోటు కేసు పునర్విచారణ జరిపించాలని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై ఇవాళ కోర్టు విచారణ జరిపింది. పిటిషనర్ వాదనలతో ఏకీభవించిన కోర్టు ఈమేరకు ఉత్తర్వులు జారీ చేసింది.

కాగా, ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో ఆంగ్లో ఇండియన్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌ను కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తూ వీడియో, ఆడియో సాక్షాలతో సహా టీడీపీ నేత రేవంత్‌రెడ్డి ఏసీబీ అధికారులకు చిక్కిన విషయం తెలిసిందే.