నేను నయీం బాధితుడినే…

412

తాను కూడా గ్యాంగ్‌స్టర్ నయీం బాధితుడినేనని ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. తనపై ప్రతిపక్ష నేతలు చేస్తున్న ఆరోపణలను ఆయన ఖండించారు. తెలంగాణభవన్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన కాంట్రాక్టర్‌లు, కమీషన్ల నుంచి మేం రాజకీయాల్లోకి రాలేదు. శాస్త్రీయ భావాలతో ప్రజాక్షేత్రం నుంచి వచ్చామని తెలిపారు. అక్రమ మార్గంలో డబ్బు సంపాదించిన వ్యక్తి ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి. అక్రమ దందాలకు కేరాఫ్ అడ్రస్ ఆయన. అభివృద్ధిని ఓర్చుకోలేకనే లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. దమ్ము, ధైర్యం ఉంటే కోమటిరెడ్డి బ్రదర్స్ బహిరంగ చర్చకు సిద్ధమేనా అంటూ సవాల్ విసిరారు.

గ్యాంగ్ స్టర్ నయీంను పోషించింది కాంగ్రెస్‌,టీడీపీలేనని టీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలు గాదరి కిశోర్‌,ప్రభాకర్ రెడ్డి,వేముల వీరేశం మండిపడ్డారు. నయీంతో నల్లగొండ జిల్లా టీఆర్ఎస్ నేతలకు సంబంధాలు ఉన్నాయంటూ వస్తున్న ఆరోపణలను వారు ఖండించారు. జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన వారు తాము ప్రజా ఉద్యమంలో భాగంగా ప్రజాప్రతినిధులుగా ఎంపికయ్యామని తెలిపారు. అహంకార ధోరణితో తమపై నిరాధార ప్రేలాపనలు చేస్తున్నారని, పిచ్చికూతలు మానకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని గాదరి కిశోర్‌ హెచ్చరించారు.ఇష్టం వచ్చిన రీతిలో వ్యవహరిస్తామంటే ప్రజలే బట్టలూడదీసి కొడతారని.. కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డికి ఇదే తమ హెచ్చరిక అని కిశోర్ అన్నారు.

నయీంతో తమకు హాని ఉన్న విషయాన్ని నాటి ముఖ్యమంత్రులు కిరణ్ కుమార్ రెడ్డి, రోశయ్యలకు చెప్పినా వాళ్లు పట్టించుకోలేదని ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి అన్నారు. అలాంటి క్రూరమృగాన్ని అంతమొందించింది ఎవరో ప్రజలకు బాగా తెలుసని తెలిపారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు గాను ప్రజల మెప్పును పొందుతుంటే ఓర్వలేక ఇలా చెబుతున్నారని ఆయన అన్నారు. తమపై ఆరోపణలు చేసేవారికి ఏమైనా అనుమానాలుంటే సిట్ అధికారులకు ఒక దరఖాస్తు ఇవ్వడమో, ఫోన్ చేసి చెప్పడమో చేయాలని సూచించారు. ఎవరు తప్పుచేసినా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ప్రభాకర్ రెడ్డి స్పష్టంచేశారు.