కొందరికి వివాదాలు అలవాటు..రాంగోపాల్ వర్మకి వివాదాలనేవి ఒక వ్యసనం లాంటివనే చెప్పాలి. ఒకపూట భోజనం లేకపోయినా వర్మ ఉండ గలడేమోకాని,వివాదాలు లేకుండా, వార్తల్లో నిలువకుండా మాత్రం వర్మ నిలువలేడు.
వివాదాల కోసమే వ్యాఖ్యలు చేసే ప్రముఖ దర్శకుడు రామ్‑గోపాల్‑వర్మ మరోసారి తనదైన ట్వీట్ లతో చెలరేగిపోయాడు. రామ్ గోపాల్ వర్మ ఏమి మాట్లాడినా ఒక సంచలనమే. మాట్లాడే మాటలో లాజిక్ ఉందా లేదా అనే విషయం పట్టించుకోకుండా ఉంటే వర్మ చెప్పే మాటలు కాని, తరచూ పెట్టె ట్విట్స్ కాని చాలా ఆశక్తి దాయకంగా ఉంటాయి. టీచర్స్ డే సందర్భంగా తన ట్విట్టర్ లో టీచర్స్ ని టార్గెట్ చేశాడు. ఈరోజు దేశం అంతా గురువులను ఆరాధిస్తూ వారికి పాద పూజలు చేస్తూ ఉంటే, గురువులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి మరోసారి వివాదంలోకి కాలు పెట్టాడు రామ్ గోపాల్ వర్మ. ఈరోజు జరుగుతున్న టీచర్స్ డే సందర్భంగా వర్మ తన ట్విట్టర్ లో ఏమి వ్యాఖ్యానాలు చేశాడో మీరే చదవండి.
గురు పూజోత్సవం సందర్భంగా ఆయన గురువుల పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ‘నా జీవితంలో ఎవరికీ హ్యాపీ టీచర్స్ డే అని చెప్పను, ఎందుకంటే నేను ఒక్క రోజు కూడా నా గురువులతో సంతోషంగా లేను. సక్సెస్‑ఫుల్ ఇంజనీర్స్, సక్సెస్‑ఫుల్ డాక్టర్స్ ఉన్నారు గాని, ఎక్కడైన సక్సెస్‑ఫుల్ టీచర్స్ ఉన్నారా.? స్కూల్ కి వెళ్లి టైమ్ వేస్ట్ చేసుకోవద్దని, విద్యార్థులు గూగుల్ ద్వారానే నేర్చుకోవాలని సూచించాడు. తానూ టీచర్ లందరిని ద్వేషించేవాడినని, అందుకే స్కూల్ ఎగ్గొట్టి సినిమాలు చూడడం వల్ల ఇంత పెద్ద దర్శకుడిని అయ్యానని చెప్పుకొచ్చాడు.
సినీ రంగంలోనే ఉపాధ్యాయ వృత్తిని తక్కువగా చూపిస్తున్న విషయాన్ని మరిచిపోయిన వర్మ ఇలాంటి కామెంట్స్ చేయటం మరోసారి వివాదాలకు కేంద్ర బిందువయ్యాయి. అయితే వర్మ చేస్తున్న రెగ్యులర్ కామెంట్స్ కు అలవాటు పడ్డ రీడర్స్ మాత్రం లైట్ గా తీసుకుంటున్నారు.