జనతా గ్యారెజ్:రివ్యూ

238

యంగ్ టైగర్ ఎన్టీఆర్ – దర్శకుడు కొరటాల శివల క్రేజీ కాంబినేషన్‌లో తెరకెక్కిన సినిమా ‘జనతా గ్యారెజ్’.. కొద్దినెలలుగా తెలుగు సినీ పరిశ్రమలో బాగా వార్తల్లో నిలుస్తున్న ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఇక ఆ అంచనాల నడుమే భారీ ఎత్తున నేడు ప్రేక్షకుల ముందుకొచ్చిన సినిమా, అంచనాలను అందుకునే స్థాయిలోనే ఉందా? చూద్దాం..

కథ :
సత్యం (మోహన్‌లాల్‌) ఆటోమొబైల్ వర్క్స్‌ రిపేరింగ్‌లో ఓ మెకానిక్‌. తమ్ముడు (రెహమాన్‌)తో పాటు హైదరాబాద్‌లో జనతా గ్యారెజ్ అనేపేరుతో రిపేర్లు చేస్తుంటాడు. అక్కడికి సమస్య అంటూ ఎవరొచ్చినా దానికి పరిష్కారం చూపిస్తుంటారు. దాంతో సత్యంకి శత్రువులు పెరుగుతారు. వాళ్లు చేసిన దాడిలో తమ్ముడ్ని కోల్పోతాడు. తమ్ముడు కొడుకు ఆనంద్‌ (ఎన్టీఆర్‌)ని మాత్రం చిన్నప్పుడే ఈ జనతా గ్యారేజ్‌కి దూరంగా పెంచడానికి మేనమామ (సురేష్‌)కి ఇచ్చి ముంబై పంపించేస్తాడు. ఆనంద్ (ఎన్టీఆర్).. చిన్నప్పట్నుంచీ మొక్కలపై ప్రేమ పెంచుకుంటూ వాటినే తన ప్రపంచంగా మార్చేసుకొని బతుకుతూంటాడు. కొన్ని అనుకోని పరిస్థితుల్లో ఎక్కడో ముంబైలో పుట్టి పెరిగిన ఆనంద్, హైద్రాబాద్‌లో ఉండే జనతా గ్యారెజ్‌కు రావాల్సి వస్తుంది. మొక్కల్ని ప్రేమించే ఓ కుర్రాడు.. మనుషుల్ని ప్రేమించే ఓ పెద్దాయన ఎలా కలుసుకొన్నారు. వారిద్దరూ కలిశాక ఏమైంది? అన్నది సినిమా.

1br30b

ప్లస్ పాయింట్స్ :
కథపై పెద్ద కసరత్తు చేయకపోయినా కొన్ని సన్నివేశాల్ని బాగానే రాసుకొన్నాడు దర్శకుడు కొరటాల శివ. రెండు బలమైన పాత్రలు, వాటి చుట్టూ ఉన్న ఎమోషన్ ఈ కథకు ప్లస్ పాయింట్లు. ముఖ్యంగా మనుషులు బాగుండాలని కోరుకునే సత్యం పాత్రలో బలమైన ఎమోషన్ ఉంది. జనతా గ్యారెజ్ అన్న ఒక పేరుని ఎంతో మందికి శక్తిగా మార్చి, సత్యం, ఓ ప్యారలల్ సొసైటీ నడపడం అన్నదానిలో అదిరిపోయే హీరోయిజం ఉంది. దీన్ని కొన్నిచోట్ల బాగానే వాడుకున్నారని చెప్పొచ్చు. కంప్లీట్ యాక్టర్ మోహన్‍ లాల్‌ను తెలుగు తెరపై చూడడమన్నది ఓ అద్భుతమైన అనుభూతి. ముఖ్యంగా కొన్ని ఎమోషనల్ సన్నివేశాల్లో మోహన్‌లాల్‌ నటన ఆకట్టుకొనేలా ఉంది.. చాలాచోట్ల సినిమాను ఆయన పాత్రే నిలబెట్టింది. ఎన్టీఆర్‌ లుక్‌ కొత్తగా ఉంది. కాకపోతే నాన్నకు ప్రేమతోలోనూ ఇలానే గడ్డంతో కనిపించాడు కాబట్టి.. ఆ ఛాయలు కనిపిస్తాయి. డైలాగ్‌ పలికే విధానంలో మార్పు చూపించాడు. ఇక సినిమా పరంగా చూసుకుంటే సెకండాఫ్‌లో మొదటి ఇరవై నిమిషాల సన్నివేశాలు మేజర్ హైలైట్‌గా చెప్పాలి. ‘ ఇక ‘పక్కాలోకల్’ అంటూ స్టార్ హీరోయిన్ కాజల్ చేసిన ఐటమ్ సాంగ్ మంచి రిలీఫ్!

మైనస్ పాయింట్స్ :
ఈ సినిమాకు ప్రధానమైన మైనస్ పాయింట్ అంటే ఒక బలమైన కథ, కథనాలు లేకపోవడమనే చెప్పాలి. అదిరిపోయే రెండు పాత్రలను పెట్టుకొని వాటి చుట్టూ అల్లిన కమర్షియల్ కథ చాలా పాతది. బలమైన ప్రతినాయకుడు లేకపోవడం పెద్ద లోపంగా కనిపిస్తుంది. పాత్రల మధ్య సంఘర్షణ మరికాస్త ఉండి ఉంటే ఇంకాస్త బాగుండేది.

636083218875896323
ఇక హీరోయిన్స్‌ సమంత, నిత్యామీనన్‌లు పాత్రలు మరి చిన్నవిగా ఉన్నాయి. పాటలకోసమే వీరిద్దరూ ఉన్నట్టు అనిపిస్తుంది. సెకండాఫ్‌లో కూడా ఇద్దరూ ఒక్కొక్క సన్నివేశానికి పరిమితమయ్యారు. సాయికుమార్‌ ప్రాధాన్యత లేని పాత్రలో కనపడతాడు. వెన్నెల కిషోర్‌ కూడా ఇలా తెరపై కనిపించి మాయమైపోతాడు.ఇక పక్కా కమర్షియల్ సినిమా అయిన ఇందులో కామెడీ లాంటిది ఎక్కడా లేకపోవడం కూడా నిరుత్సాహపరచే అంశమే.

సాంకేతిక విభాగం :

టెక్నికల్‌గా బలమైన టీమ్‌ని ఎంచుకొన్నాడు కొరటాల. రెండు మంచి పాత్రలతో కథ చెప్పాలని ప్రయత్నించిన శివ, అసలు కథని మాత్రం పూర్తి స్థాయిలో మెప్పించేలా రాయలేకపోయారు. జనతా గ్యారెజ్ నేపథ్యాన్ని, సెకండాఫ్‌లో మొదటి ఇరవై నిమిషాలను బాగా డీల్ చేశాడు. తిరు కెమెరా పనితనం ఆకట్టుకొంటుంది. యాక్షన్‌ సన్నివేశాల్ని బాగా పిక్చరైజ్‌ చేశారు. దేవిశ్రీ ప్రసాద్ అందించిన పాటలు బాగున్నాయి. రెండు పాటలు అభిమానుల్ని అలరిస్తాయి. నేపథ్య సంగీతం మాత్రం ఒకేలా సాగింది. ఎడిటింగ్ బాగున్నా.. విజువల్ ఎఫెక్ట్స్ సాధారణంగానే ఉన్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడక్షన్ వ్యాల్యూస్ చాలా బాగున్నాయి.

తీర్పు :
శ్రీమంతుడు.. మిర్చి సినిమాల్లోనూ ఒక బలమైన అంశాన్ని, తెలుగు సినిమాకు అలవాటైన ఫార్మాట్‌లో చెప్పి సక్సెస్ కొట్టిన కొరటాల శివ.. ఈసారి పూర్తిగా కమర్షియల్ పంథాని మాత్రమే నమ్ముకొని ‘జనతా గ్యారెజ్’ చేశాడు. అయితే ఎన్టీఆర్, మోహన్ లాల్‌ల అదిరిపోయే స్క్రీన్ ప్రెజెన్స్, యాక్టింగ్, సెకండాఫ్‌లో మొదటి ఇరవై నిమిషాల పాటు వచ్చే ఎమోషనల్ సన్నివేశాలు లాంటివి ఈ సినిమాకు కమర్షియల్‌గా బాగా కలిసివచ్చే అంశాలుగా నిలిచాయి. ఒక్కమాటలో చెప్పాలంటే.. జనతా గ్యారేజ్‌ను మరింత రిపేర్ చేసి ఉండాల్సింది

విడుదల తేదీ : సెప్టెంబర్ 1, 2016
రేటింగ్ : 3/5
నటీనటులు : ఎన్టీఆర్, మోహన్ లాల్, నిత్యా మీనన్, సమంత..
నిర్మాత : నవీన్ ఎర్నేని, వై. రవి శంకర్, మోహన్
సంగీతం : దేవీ శ్రీ ప్రసాద్
దర్శకత్వం : కొరటాల శివ