పవన్ కళ్యాణ్.. జూనియర్ ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోలు ప్రాణాంతవ వ్యాధులతో బాధపడుతూ చివరి దశలో ఉన్న తమ అభిమానుల్ని కలిసి వారిలో సాంత్వన చేకూర్చడం తెలిసిందే. అలాగే మంచు లక్ష్మి కూడా ఓ అభిమానిని కలిసింది. లక్ష్మిని చూడటమే తన చివరి కోరిక అంటూ ఓ క్యాన్సర్ పేషెంట్ అడగడం విశేషం. ‘మేము సైతం’ అనే మంచి కార్యక్రమం ద్వారా మనసులు గెలుస్తున్న మంచు లక్ష్మిని చూడాలంటూ మానస అనే 34 ఏళ్ల క్యాన్సర్ పేషెంట్ అడిగింది. ఆమె కోరిక తీరుస్తూ లక్ష్మి తనను కలిసింది కూడా.
`మేము సైతం` బుల్లితెరపై ఎంతటి సక్సెస్ సాధించిందో తెలిసిందే. ఈ సామాజిక కార్‌వక్రమంతో ఆపన్నులను ఆదుకునేందుకునేందుకు మేమున్నాం అంటూ ముందుకొస్తున్నారు మన స్టార్లు. సామాన్యులు, కష్టాల్లో ఉన్నవారికి `మేముసైతం` ఊపిరి పోస్తోందనడంలో సందేహమే లేదు. ఇలాంటి గొప్ప కార్యక్రమానికి హోస్ట్ గా మంచు లక్ష్మి ప్రసన్న ఎంతో మంచి పేరు తెచ్చుకున్నారు. సామాన్యుల గోడు బయటి ప్రపంచానికి ఆవిష్కరించడంలో హోస్ట్ రెస్పాన్సిబిలిటీ అనితరసాధ్యమైనది. ఆ బాధ్యతను విజయవంతంగా నిర్వర్తించడంలో లక్ష్మి గొప్పతనాన్ని కీర్తించనివారు లేరు.
అయితే ఈ బృహత్కర కార్యక్రమం ఇన్‌స్పయిర్ చేసిందో ఏమో ..“మంచు లక్ష్మి ప్రసన్నను చూడాలని ఉంది.. అదే నా చివరి కోరిక“.. అంటూ మరణానికి చేరువలో ఉన్న క్యాన్సర్ పేషెంట్ మానస (34) డాక్టరును అడిగారట. మానస కోరికను మన్నించి ఈరోజు ఉదయమే మంచు లక్ష్మి ప్రసన్న, నటుడు రఘుబాబు `స్పర్శ్` (హీలింగ్ సెంటర్) స్వచ్ఛంద సంస్థలో ఉన్న తనని చూసేందుకు వెళ్లారు.
“చివరి కోరికగా .. మంచు లక్ష్మి ప్రసన్నను చూడాలని మానస అడిగారని డాక్టరు నాకు ఫోన్ చేశారు. వెంటనే లక్ష్మీ ప్రసన్న గారికి ఈ విషయం తెలియజేశాను. తను వెంటనే ఆ పేషెంట్‌ని చూడాలని అన్నారు. మానస గతంలో టీచర్‌గా పనిచేశారు. క్యాన్సర్ చివరి దశలో ఉంది. మరో మూడు నెలల్లో చనిపోతారని డాక్టర్లు చెప్పారట. స్పర్శ్‌లో చివరి రోజుల్ని గడుపుతున్నారు… ఆమెను ఇలా కలవడం.. భావనకందని ఉద్వేగం నింపింది. అర్థగంటపైగానే మంచు లక్ష్మిగారు, నేను తనతో గడిపాం.. మన ద్వారా మంచి జరిగితే అంతకంటే ఇంకేం కావాలి…. అందుకే ఇలా వెళ్లి కలిశాం“ అని తెలిపారు రఘుబాబు.