తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగలనుంది. ఆ పార్టీ సీనియర్ నేత,మాజీ మంత్రి దానం నాగేందర్ టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకనేందుకు రంగం సిద్ధమైనట్లు సమాచారం. ఈ మేరకు దానం ఇవాళ సీఎం కేసీఆర్‌ని కలిశారు. దీంతో దానం టీఆర్ఎస్‌లో చేరిక లాంఛనమే అన్న సంకేతాలు వెలువడుతున్నాయి.
2014 సార్వత్రిక ఎన్నికల నుంచి కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో దూరంగా ఉంటూ వస్తున్నారు దానం. పార్టీలో సీనియర్ నేతగా ఉన్న దానం గ్రేటర్ ఎన్నికల సమయంలో కూడా పెద్దగా ప్రచారం నిర్వహించలేదు. గ్రేటర్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉంటూ ఆయన ప్రచారం నిర్వహించక పోవడం పెద్ద చర్చనీయాంశమైంది. అయితే దానం అప్పుడే టీఆర్ఎస్‌లో చేరుతారని భావించిన….ఆ వార్తలను ఆయన ఖండించారు.
తాజాగా కేసీఆర్‌ని కలిసిన అనంతరం దానం మంత్రి కేటీఆర్‌ని కూడా కలిశారు. అయితే కేటీఆర్‌ను తాను వ్యక్తిగత పనుల నిమిత్తమే కలిశానని.. రాజకీయ ప్రాధాన్యత లేదని నాగేందర్ స్పష్టం చేశారు.ఇటీవలె ఎమ్మెల్సీ,దానం ప్రధాన అనుచరుడు ఎంఎస్ ప్రభాకర్ టీఆర్ఎస్‌లో చేరిన సంగతి తెలిసిందే.
1994లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన నాగం తర్వాత 1999,2004,2009 ఎన్నికల్లో విజయభేరి మోగించారు. గ్రేటర్ కాంగ్రెస్‌లో సీనియర్ నేతగా…తన పట్టును నిలుపుకున్నారు.రాజశేఖర్ రెడ్డి,రోశయ్య,కిరణ్ కూమర్ రెడ్డి హయాంలో మంత్రిగా పనిచేశారు.2014 ఎన్నికల్లో బీజేపీ నేత రాంచంద్రారెడ్డి చేతిలో ఓటమి చవిచూశారు.