కాన్పూర్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న 500వ టెస్టు మ్యాచ్‌లో భారత స్పిన్ ద్వయం రవిచంద్రన్ అశ్విన్, జడేజాల దెబ్బకు న్యూజిలాండ్ ఆటగాళ్లు బేర్ మన్నారు. భారత తొలి ఇన్నింగ్స్ 318 పరుగులకు బదులుగా, ఒక వికెట్ నష్టానికి 152 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో నేడు బ్యాటింగ్ ప్రారంభించిన న్యూజిలాండ్ సరిగ్గా 100 పరుగులు మాత్రమే జోడించి మిగతా 9 వికెట్లను కోల్పోయింది. న్యూజిలాండ్ జట్టు 95.5 ఓవర్లలో 262 పరుగులకు ఆలౌట్ కాగా, భారత్ కు 56 పరుగుల లీడ్ లభించింది.
మూడో రోజైన శనివారం 152/1తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన కివీస్ లంచ్ విరామ సమయానికి 238/5తో నిలిచింది. భారత బౌలర్ల సహనాన్ని శుక్రవారం పరీక్షించిన న్యూజిలాండ్ అర్ధశతక వీరులు టామ్ లాథమ్ (58: 151 బంతుల్లో 5×4), కేన్ విలియమ్సన్ (75: 137 బంతుల్లో 7×4) తొలి సెషన్ ఆరంభంలోనే స్పిన్నర్ల ధాటికి పెవిలియన్ చేరిపోగా.. రాస్ టేలర్ కూడా డకౌట్‌గా వెనుదిరిగాడు. దీంతో 11 పరుగుల వ్యవధిలోనే కివీస్ మూడు కీలక వికెట్లు కోల్పోయి ఒత్తిడిలో నిలిచింది. ఈ దశలో మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ లూక్ రోంచి (38: 83 బంతుల్లో 6×4) కాసేపు దూకుడుగా ఆడుతూ ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేసినా జడేజా విసిరిన తెలివైన బంతికి అడ్డంగా వికెట్ల ముందు దొరికిపోయాడు. సోధీ, బౌల్ట్, టేలర్ లు డక్కౌట్ కాగా, క్రెయిగ్ 2, వాట్లింగ్ 21 పరుగులు చేశారు. జడేజాకు 5, అశ్విన్ కు 4 వికెట్లు లభించగా, ఉమేష్ యాదవ్ కు ఒక వికెట్ లభించింది. కాగా, భారత్ రెండో ఇన్నింగ్స్ ప్రారంభించింది.