గిరిజన సంక్షేమ శాఖ అన్ని అంశాల్లో సమర్థవంతమైన శాఖగా గుర్తింపు తెచ్చుకునేలా పనిచేయాలని రాష్ట్ర గిరిజన సంక్షేమ, స్త్రీ- శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ కోరారు. గిరిజన శాఖ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో జరుగుతున్న పనులపై శాఖ కమిషనర్, కార్యదర్శి క్రిస్టినా జడ్ చోంగ్తుతో కలిసి దామోదర సంజీవయ్య సంక్షేమ భవన్ లో సమీక్ష చేశారు. గిరిజనుల కోసం జరిగే పనుల్లో జాప్యత, నిర్లక్ష్యం ఉండకూడదని, నిర్ధేశించిన గడువులోపు ఇంజనీరింగ్ పనులు నాణ్యతతో పూర్తి చేయాలన్నారు. లేనిపక్షంలో తప్పు ఉన్న వారిపై చర్యలు తీసుకోవాలని కమిషనర్ ను ఆదేశించారు. ఇప్పటి వరకు ఎలా పనిచేసినా…ఇకపై మాత్రం కచ్చితంగా పనుల వేగం పెరగాలని, పెండింగ్ పనులన్ని నిర్ధేశించిన గడువులో పూర్తి చేయాలన్నారు.
2016లో మంజూరు అయిన పనులు ఇంకా కొనసాగుతున్నాయని, అందువల్లే గిరిజన శాఖ ఇంజనీరింగ్ విభాగం పట్ల కొంత దురభిప్రాయం నెలకొందని, దీనిని తొలగించుకునే విధంగా సమర్థవంతంగా పనిచేయాలని సూచించారు. గిరిజన శాఖ పనులు ఆలస్యమవుతాయనే కారణంతో ఇటీవల దాదాపు 100 కోట్ల రూపాయల విలువైన పనులు ఇతర శాఖలకు ఇవ్వాల్సి వచ్చిందన్నారు. భవిష్యత్ లో ఇలాంటి పరిస్థితి పునరావృతం కాకుండా పనులు చేయాలన్నారు.
అనేక శాఖలలో పనులు జరుగుతన్నా నిధులు విడుదల కాలేదని, గిరిజనుల కోసం జరిగే పనులు ఆగోద్దని ముఖ్యమంత్రి కేసిఆర్ గారు అడిగిన వెంటనే నిధులు ఇస్తున్నారని, కాబట్టి ఏజన్సీల వెంట పడి పనులు పూర్తి చేయించాలన్నారు. జిల్లాలలో రోడ్లు, గిరిజన భవనాలు, విద్యాలయాల భవనాల నిర్మాణంలో ఏవైనా సమస్యలు వస్తే వెంటనే సంబంధిత రెవెన్యూ అధికారులు, కలెక్టర్లతో సంప్రదించి పరిష్కారం అయ్యేటట్లు చొరవ ప్రదర్శించాలన్నారు. మీ స్థాయిలో కాకపోతే సెక్రటరీ దృష్టికి, నా దృష్టికి తీసుకొస్తే మా స్థాయిలో మాట్లాడి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
ఆగస్టు నుంచి విద్యా సంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో మొట్టమొదట విద్యాలయాల భవనాల నిర్మాణానికి ప్రాధాన్యత ఇచ్చి పూర్తి చేయాలన్నారు. ఆగస్టు, సెప్టెంబర్ నాటికి పూర్తి అయ్యే భవనాల జాబితా ఇస్తే…ఇప్పుడు కిరాయి ఉంటున్న భవనాల నుంచి వచ్చే నెల, రెండు నెలల్లో ఖాళీ చేయడానికి వారికి కూడా ప్లాన్ చేసుకునే అవకాశం లభిస్తుందన్నారు. లాక్ డౌన్ తర్వాత ప్రతి జిల్లా పర్యటించి గిరిజన శాఖ పరిధిలో జరుగుతున్న పథకాల అమలు, పనుల తీరును పరిశీలిస్తానని, ఎక్కడా లోపం ఉన్నా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రోడ్ల పనులు చాలా నెమ్మదిగా కొనసాగుతున్నాయని, వీటి పనుల వేగం పెంచాలని చెప్పారు.
హైదరాబాద్ లోని కొమురం భీమ్, సేవాలాల్ భవనాలు కూడా యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించారు. జిల్లాల వారిగా పెండింగ్ పనులు ప్రణాళిక రూపొందించుకుని, వాటిని పూర్తిచేసేందుకు యాక్షన్ ప్లాన్ ఇవ్వాలన్నారు. అనంతరం సంక్షేమ భవన్ లో పనిచేసే కార్మికులకు నిత్యావసర సరుకులు అందించారు. సమావేశంలో కొత్తగా గిరిజన సంక్షేమ శాఖ అదనపు సంచాలకులు సర్వేశ్వర్ రెడ్డి, చీఫ్ ఇంజనీర్ నగేశ్, ఇతర ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.