వచ్చే సంవత్సరం ఉత్తర్ ప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు రానుండడంతో అధికార సమాజ్ వాదీ పార్టిలో కుటుంబ పోరు అపుడే మొదలైంది. మళ్లీ సీఎంగా తానే కావాలని ప్రయత్నాలు ప్రారంభించిన అఖిలేష్ యాదవ్‌కు ములాయం సింగ్ చెక్ పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. సమాజ్ వాదీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న అఖిలేష్‌ను తొలగించి ఆయన స్థానంలో ములాయం తమ్ముడు శివపాల్ యాదవ్‌ని నియమించారు ములాయం. దీన్ని సహించలేని అఖిలేష్.. తన బాబాయ్ అయిన శివపాల్ యాదవ్ ఆధీనంలో ఉన్న కీలకమైన ప్రజా పనుల విభాగం, నీటి పారుదల, రెవెన్యూ, సహకార మంత్రిత్వశాఖలను తొలగించారు. కేవలం సాంఘీక సంక్షేమ శాఖను మాత్రమే ఉంచాడు. దీనిపై స్పందించిన ములాయం.. వెంటనే ఇద్దరూ వచ్చి తనను కలవాల్సిందిగా ఉన్న సమన్లు జారీ చేశారు.
మరోవైపు ఇది తమ ఇంటి గొడవ కాదని, ప్రభుత్వ గొడవేనని సీఎం అఖిలేష్ తేల్చి చెప్పారు. అయితే కీలక నిర్ణయాలు ములాయంకు చెప్పే తీసుకున్నానని, కొన్ని మాత్రం తన సొంతవని అఖిలేష్ వివరణ ఇచ్చారు. గ్యాంగ్‌స్టర్ ముఖ్తార్ అన్సారీ పార్టీనీ ఎస్పీలో విలీనం చేయాలన్న శివ్‌పాల్ నిర్ణయాన్ని అఖిలేష్ తీవ్రంగా వ్యతిరేకించారు. అప్పటి నుంచే ఇద్దరి మధ్యా దూరం పెరిగింది.
దీంతో రగిలిపోతున్న శివ్‌పాల్ యాదవ్ పూర్తిగా అఖిలేశ్ కేబినెట్ నుంచి తప్పుకోవాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ‘నేతాజీ’ ములాయంతో సమావేశమైన తర్వాత కేబినెట్ నుంచి తప్పుకొనే విషయంలో నిర్ణయం తీసుకుంటానని ఆయన తెలిపారు. ములాయం ఏం చెప్పినా దానిని పాటించేందుకు తాను సిద్ధమని తెలిపారు. బుధవారం ఉదయం తన మద్దతుదారులతో సమావేశమైన ఆయన యూపీ ప్రజలు ఎస్పీ వెంట ఉన్నారంటూ పరోక్షంగా అఖిలేశ్‌పై విమర్శనాస్త్రాలు సంధించారు.
గత నాలుగేళ్లుగా తన వర్గానికి సరైన ప్రాతినిధ్యం లభించడం లేదని అలిగున్న సోదరుడు శివపాల్ యాదవ్ ను బుజ్జగించడం కూడా ముఖ్యమన్న ఉద్దేశంతోనే ఆయనకు పార్టీ అధ్యక్ష పదవి ఇచ్చినట్టు తెలుస్తోంది.