వైకుంఠ ఏకాదశి విశిష్టత..

658
- Advertisement -

తెలుగు రాష్ట్రాల్లో  వైకుంఠ ఏకాదశి శోభ సంతరించుకుంది. ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆలయాలకు భక్తులు పోటెత్తారు.  తెల్లవారుజాము నుంచే ఆలయాలకు చేరుకున్న భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. భక్తులతో వైష్ణవాలయాలన్నీకిటకిటలాడుతున్నాయి. వైకుంఠ ఏకాదశి అంత్యంత పరమపవిత్రమైన రోజు.  ఉత్తరద్వార మార్గంలో స్వామిని దర్శించుకోవాలని ఈ రోజు భక్తులు ఎంతో ఆరాటపడతారు.

ఒక్క ఏడాదిలో ఇరవైనాలుగు ఏకాదశులు వస్తాయి. ప్రతి ఏకాదశీ పవిత్రమైనదే. అందులో మరీ విశేషంగా పరిగణించే ఏకాదశులు నాలుగు. ఆ విశేష ఏకాదశులలో ఒకటిగా పరిగణించేదే ఈ వైకుంఠ ఏకాదశి. సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి అంటారు. అసలు ఈ రోజుకు ఎందుకు అంత ప్రాధాన్యం అంటే.

ఉత్తర ద్వార దర్శనం

వైకుంఠ ఏకాదశినాడు తెల్లవారుజాము నుంచే ఆలయాల్లో భక్తులు ఉత్తర ద్వార భగవత దర్శనార్థం వేచి ఉంటారు. ఈరోజున వైకుంఠం వాకిళ్లు తెరుచుకునే పర్వదినం. ముక్కోటి ఏకాదశినాడు సాక్షాత్తూ ఆ శ్రీమహావిష్ణువు గరుడ వాహనారూఢుడై మూడు కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తాడు. అందువల్లనే ముక్కోటి ఏకాదశి అని దీనికి పేరు. మూడు కోట్ల ఏకాదశులతో సమానమైన ఈ ఏకాదశి పవిత్రత సంతరించుకున్నందువల్ల దీన్ని ముక్కోటి ఏకాదశి అంటారని కూడా చెబుతారు. దేవతలు, రాక్షసులు జరిపిన క్షీరసాగర మథనంలో ముక్కోటి ఏకాదశి నాడే హాలాహలం, అమృతం రెండూ పుట్టాయి. కాలకూటవిషాన్ని పరమేశ్వరుడు తన గరళాన బంధించింది ఆ రోజే. మహాభారత యుద్ధ సమయంలో అర్జునుడికి శ్రీకృష్ణుడు భగవద్గీతను ఉపదేశించింది కూడా ముక్కోటి ఏకాదశినాడే అనేది ఒక విశ్వాసం.  కావున ఆరోజు మన అందరం దగ్గరలోని వైష్ణవ ఆలయం లో ఉత్తర ద్వార దర్శనం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం

ఏడాదిలో ఈ చక్రస్నానాలు జరిగే నాలుగుసార్లూ ముల్లోకాల్లో ఉన్న పుణ్యతీర్థాలు స్వామి పుష్కరిణిలో సూక్ష్మరూపంలో ప్రవేశిస్తాయని విశ్వాసం. అనంతపద్మనాభ వ్రతం రోజున, బ్రహ్మోత్సవాలలో చివరి రోజున, వైకుంఠ ఏకాదశి మరునాటికి ద్వాదశి తిథి ఉన్నరోజు, రథసప్తమి రోజు, స్వామివారికి చక్రస్నానాలు జరుగుతాయి. అందుకే ఈరోజున ప్రత్యేకించి వైష్ణవ ఆలయాల్లో విశేష పూజలు నిర్వహిస్తారు.
ఇంకా వైకుంఠ ఏకాదశి రోజున నిష్ఠనియమాలతో వ్రతమాచరించే వారికి మరో జన్మంటూ ఉండదని పురాణాలు చెబుతున్నాయి. ముక్కోటి ఏకాదశిన మరణించేవారికి వైకుంఠవాసం సిద్ధిస్తుందని, స్వర్గంలోని తలుపులు వారికోసం తెరిచే ఉంటాయని శాస్త్రాలు పేర్కొంటున్నాయి. ముల్లోకాలను నడిపించే విష్ణుమూర్తిని ముక్కోటి ఏకాదశిన స్తుతించే వారికి మోక్షం ప్రాప్తిస్తుంది.
వైకుంఠ ఏకాదశి రోజు అన్నం ముట్టకూడదు. ముర అనే రాక్షసుడు అన్నం రూపంలో ఉంటాడని ఒక విశ్వాసం అయితే, ఇంకొక కథ ప్రకారం బ్రహ్మ తలనుంచి ఒక స్వేద బిందువు నేలమీదపడి వెంటనే రాక్షస రూపం దాల్చింది. ‘‘ఓ బ్రహ్మదేవ, నాకు నివాస స్థానం చూపించు’’ అని ఆ రాక్షస రూపం ప్రార్థించింది. ఏకాదశినాడు మానవులు భుజించే వరి అన్నంలో ప్రవేశించి తద్వారా వారి ఉదరాల్లో స్థావరం ఏర్పర్చుకోమని బ్రహ్మ ఆ రాక్షస రూపానికి వరం ఇచ్చాడు. అందుకే ఈ రోజు శ్రీ మహావిష్ణువును షోడ శోపచారాలతో ఆరాధించి, చాలామంది ఉపవాసం చేస్తారు.
- Advertisement -