దేశం సర్వతోముఖాభివృద్ధిని సాధించాలంటే అన్ని వర్గాల ప్రజలను భాగస్వాములను చేయాలనే తెలంగాణ ప్రభుత్వ విధానాలే నేడు జాతికి రోల్‌మెడల్‌గా మారాయని, అందుకే తెలంగాణ పథకాలను దేశవ్యాప్తంగా అమలు చేయాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. అంతేగాక సంక్షేమ పథకాలతో కూడా ఆర్ధికాభివృద్ధిని సాధించవచ్చునని చెప్పడమే కాకుండా చేసి చూపించిన తెలంగాణ ప్రభుత్వ పథకాల అమలుతీరును పరిశీలించడానికి ఇతర రాష్ట్రాల నుంచి పరిశీలకులు వస్తున్నారని కొందరు సీనియర్ ఐ.ఎ.ఎస్.అధికారులు వివరించారు. ఆర్ధికాభివృద్ధిలో బడుగు, బలహీన, గిరిజన వర్గాల ప్రజలను కూడా భాగస్వాములను చేయడం మూలంగా గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఎకనమిక్ యాక్టివిటీ పెరుగుతుందని, తద్వారా ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతుందని వివరించారు.
ప్రజలు కొనుగోలు చేసే ప్రతి వస్తువు నుంచి 30 శాతం నిధులు పన్నుల రూపంలో తిరిగి ప్రభుత్వ ఖజానాకు చేరుతూనే ఉంటాయని తెలిపారు. సంక్షేమ పథకాలతో బడుగు వర్గాల ప్రజలకు ఆర్ధిక సహాయం చేసి, ఉపాధి అవకాశాలను కల్పిస్తే వారు కూడా తమతమ కుటుంబాలను పోషించుకొంటూ, ఆర్ధికాభివృద్ధిని సాధిస్తూ రాష్ట్ర స్థూల ఆర్ధిక వృద్ధిలో భాగస్వాములవుతారని, ఈ మహోన్నతమైన ఆలోచనల నుంచి ఉద్భవించిందే దళితబంధు పథకమని, అది ఇప్పుడు దేశానికి ఎంతో అవసరమని ఉత్తర భారత రాష్ట్రాలకు చెందిన పలువురు సీనియర్ ఐ.ఎ.ఎస్. అధికారులు అంటున్నారు. దేశంలో షెడ్యూల్డు కులాలకు చెందిన జనాభా ఆర్ధికాభివృద్ధిని సాధించలేదని, ఆ వర్గాలు ఇంకనూ అనేకరకాల అన్యాయాలకు గురవుతున్నారని, అందుచేతనే బి.ఆర్.ఎస్.పార్టీని గెలిపించుకుంటే దేశవ్యాప్తంగా దళితబంధు పథకాన్ని అమలు చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు చేసి ప్రకటన దేశవ్యాప్తంగా అతిపెద్ద చర్చకు దారితీసిందని, అందుకే వివిధ రాష్ట్రాలకు చెందిన అధికారులు దళితబంధు గురించి తెలుసుకునేందుకు ఫోన్లు చేస్తున్నారని ఆ అధికారులు వివరించారు. దేశంలో 139 కోట్ల 34 లక్షల జనాభా ఉందని, అందులో షెడ్యూల్డు కులాలకు చెందిన వారు ఏకంగా 20,13,78,086 మంది ఉన్నారని, అంటే మొత్తం జనాభాలో ఎస్సీలు 16.6 శాతం ఉన్నారని, ఇంతటి భారీ
రాజకీయాలకే వాడుకున్నారే తప్ప ఆ వర్గాల ప్రజలను అన్నిరంగాల్లోనూ ముందుకు తీసుకురావాలని చిత్తశుద్ధితో ఎవ్వరూ ప్రయత్నాలు చేయలేదని, అందుకే తమ ముఖ్యమంత్రి కె.సి.ఆర్. ఈ తరహా చారిత్రాత్మకమైన నిర్ణయాన్ని తీసుకొన్నారని వివరించారు. దేశంలో ఎస్సీ కేటగిరీలో 1,108 ఉప కులాల ప్రజలు ఉన్నారని, వీరందరికి సుమారు అయిదు కోట్ల కుటుంబాలున్నాయని, ఈ అయిదు కోట్ల కుటుంబాలకు దళితబంధు పథకాన్ని అమలు చేయవచ్చునని వివరించారు. ఒక్కొక్క ఎస్సీ లబ్దిదారు కుటుంబానికి పది లక్షల రూపాయల లెక్కన అయిదేళ్ళల్లో దేశంలోని అన్ని ఎస్సీ కుటుంబాలకు ఈ పథకాన్ని అత్యంత ఈజీగా అమలు చేయవచ్చునని తెలిపారు. దేశంలోని ఎస్సీల కుటుంబాలకు దళితబంధు పథకాన్ని అమలు చేయడానికి 5.03 లక్షల కోట్ల రూపాయల నిధులు అవసరమవుతాయని ఆ అధికారులు వివరించారు. ఇదేమీ కష్టతరమైన పనేమీకాదని, కేంద్ర ప్రభుత్వానికి తలకుమించిన భారంకూడా కాదని, కరాఖండిగా చెబుతున్నారు.
కేంద్ర ప్రభుత్వ ఖజానాలో రికార్డుస్థాయిలో వచ్చిన ఆదాయం సుమారు 29 లక్షల కోట్ల రూపాయల నిధులు మూలుగుతున్నాయని, అందులో పీకల్లోతు కష్టాల్లో ఉన్న షెడ్యూల్డు కులాల వారికి కేవలం అయిదు లక్షల కోట్ల రూపాయలను కూడా ఖర్చు చేయలేరా..? అని ఆ అధికారులు ఎదురు ప్రశ్నవేస్తున్నారు. అంతేగాక చాలామంది దళితబంధు పథకాన్ని పూర్తిగా అర్ధంచేసుకోలేదని, ఒక్క సారి పది లక్షల రూపాయల నిధులతో దళిత లబ్దిదారుడికి ఒక ట్రాక్టర్లోనో, లేక ఒక జెసిబినో కొని ఇస్తే కనీసం 15 నుంచి 20 ఏళ్ళపాటు ఆ యంత్రాలను సద్వినియోగం చేసుకుంటాడని, తద్వారా ఆర్ధికాభివృద్ధిలో ప్రతి ఏటా ఆ లబ్దిదారుడు భాగస్వామి అవుతున్నాడనే విషయాన్ని చాలా మంది రాజకీయ నాయకులు విస్మరిస్తున్నారని ఆ అధికారులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. కేవలం దళితబంధు పథకాన్నే కాదని, ఎస్సీల కంటే ఇంకా కష్టాలు పడుతున్న గిరిజన జాతులను కూడా ఆర్ధికాభివృద్ధిలో భాగస్వాములను చేయదలచుకొంటే కూడా గిరిజన బంధు పథకాన్ని ప్రవేశపెట్టవచ్చునని సూచిస్తున్నారు. ఎందుకంటే దేశంలో గిరిజనులు (ఎస్.టి) 10.40 కోట్ల మంది జనాభా ఉందని, ఈ జనాభాకు సుమారు 2.50 కోట్ల కుటుంబాలు ఉన్నాయని, వారికి కూడా ఆ పథకాన్ని ప్రవేశపెడితే మహా అయితే 2.5 లక్షల కోట్ల రూపాయల నిధులు అవసరం అవుతాయని వివరించారు. దేశవ్యాప్తంగా గిరిజనుల్లో 705 తెగలున్నాయని, ఇందులో 15 తెగలకు చెందిన వారే కాస్తంత చెప్పుకోదగిన స్థాయిలో ఉన్నారని, ఇప్పటికీ కొన్ని వందల గిరిజన తెగల ప్రజలు బాహ్య ప్రపంచంతో సంబంధాలు లేకుండా జీవిస్తున్నారని వివరించారు.
కోట్లాది మంది గిరిజన తెగలకు రక్షిత మంచినీరు లేదని, తమ గ్రామాలు, తాండాలు, గిరిజన గూడేలకు కరెంటు, రోడ్డు వసతులు కూడా లేవని, అలా గిరిజనులను ఆదుకోవాలచి చిత్తశుద్ధి ఉంటే గిరిజనబంధు పథకాన్ని ప్రవేశపెట్టి అమలుచేస్తే ఆ వర్గాలు కూడా తమకు తాము ఆర్ధికాభివృద్ధిని సాధించడమే కాకుండా దేశ ఆర్ధికాభివృద్ధిలో భాగస్వాములవుతారని అంటున్నారు. అందుకే దళితబంధు, గిరిజన బంధు వంటి పథకాలు వస్తేనే దేశం సర్వతోముఖాభివృద్ధిని సాధిస్తుందని, అందుకు తెలంగాణ రాష్ట్రమే నిలువెత్తు నిదర్శనమని అంటున్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వాల్సిన 34,149 కోట్ల బకాయిలను ఎప్పటికప్పుడు విడుదల చేసినట్లయితే, గడచిన రెండేళ్ళుగా తెలంగాణ ఖజానాకు కేంద్రం గండి కొట్టిన 69 వేల కోట్ల రూపాయలను అడ్డుకోకుండా యధావిధిగా విడుదల చేస్తూ వచ్చినట్లయితే దళితబంధుతో పాటుగా గిరిజనబంధు, ఇంకా అనేక బీసీ కులాలకు కూడా ఈ తరహా పథకాలను ముఖ్యమంత్రి కె.సి.ఆర్. ప్రవేశపెట్టే వారని, కేంద్రం సింగిల్ పాయింట్ ఎజెండాగా రాష్ట్రాన్ని ఆర్ధికంగా దెబ్బకొట్టేందుకు పూనుకోవడంతోనే ఇలా మౌనంగా ఉండాల్సి వచ్చిందని ఆ అధికారులు వివరించారు. ఇకనైనా కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంపై కక్షసాధింపు ధోరణిని విడనాడి ఆర్ధికంగా సహకరించాలని ఆ అధికారులు కోరుతున్నారు.