స్వచ్ఛ సర్వేక్షణ్- 2020లో నగరాలకు స్వచ్ఛతపై ర్యాంకింగ్‌లను ప్రజాభిప్రాయ సేకరణ ద్వారానే ప్రకటించడానికి కేంద్ర స్వచ్ఛ భారత్ మిషన్ ప్రాధాన్యత ఇచ్చింది. 2020 స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమాన్ని రెండు విభాగాలుగా విభజించి ర్యాంకింగ్‌లను జారీచేయనున్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్ లీగ్ -2020గా పేర్కొనే మూడు త్రైమాసిక మూల్యాంకనం ద్వారా స్వచ్ఛతపై నగరాలకు మార్కులను విధించనున్నారు. 2019 ఏప్రిల్ మాసం నుండి జూన్ వరకు మొదటి త్రైమాసికం, జూలై నుండి సెప్టెంబర్ వరకు, అక్టోబర్ నుండి డిసెంబర్ వరకు రెండు మూడు త్రైమాసికల్లో మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను, మెట్రో సిటీలలో చేపట్టిన స్వచ్ఛ కార్యక్రమాలపై నివేదికలను స్వచ్ఛ భారత్ మిషన్‌కు సమర్పించాల్సి ఉంటుంది.
ఒకొక్క త్రైమాసికానికి 2వేల మార్కుల చొప్పున విధిస్తారు. ముఖ్యంగా గతంలో మాదిరిగానే స్వచ్ఛ కార్యక్రమాలు, తడి, పొడి చెత్త వేర్వేరు, ఇంటింటి నుండి చెత్త సేకరణ, కాలనీ, బస్తీ సంక్షేమ సంఘాల భాగస్వామ్యం, ఓ.డి.ఎఫ్‌కు చర్యలు, బహిరంగ మలమూత్ర విసర్జన నివారణ చర్యలు, స్వచ్ఛతపై చైతన్య కార్యక్రమాలు, జరిమానాల విధింపు, భవన నిర్మాణ వ్యర్థాల రీసైక్లింగ్ తదితర అంశాలతో పాటు వ్యర్థ జలాలను శుద్ధిచేసి తిరిగి వినియోగించుకోవడం, మల వ్యర్థాల నిర్వహణకు ప్రస్తుత 2020 స్వచ్ఛ సర్వేక్షణ్‌లో అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. ఈ మూడు త్రైమాసికల్లో అప్లోడ్ చేసిన నివేదికలను సమీక్షించి మార్కులను స్వచ్ఛ భారత్ మిషన్ కేటాయిస్తుంది.
ఈ మూడు త్రైమాసికల్లో వచ్చిన మార్కుల్లో 50శాతం మార్కులను చివరి త్రైమాసికం (4వ సర్వే)లో వచ్చిన మార్కులకు కలుపుతారు. ఈ రెండింటిని కలుపగా వచ్చిన మార్కులను దేశంలోని ఇతర మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, మెట్రో సిటీలకు వచ్చిన మార్కులతో పోల్చి అధికంగా వచ్చిన మార్కుల ప్రాతిపదికంగా స్వచ్ఛ సర్వేక్షణ్-2020 ర్యాంకింగ్‌లను ప్రకటిస్తారు. ముఖ్యంగా మున్సిపల్ సంస్థలు, స్వచ్ఛ సర్వేక్షణ్‌లో చేపట్టిన అంశాల పై సమర్పించే నివేదికల ఆధారంగా నగరవాసులను 12 ప్రశ్నలతో ఫోన్ల ద్వారా సంప్రదిస్తారు. ఈ 12 ప్రశ్నలకు స్థానికులు ఇచ్చే సమాదానాల ప్రాతిపదికపై మెరుగైన ర్యాంకింగ్‌లు లభించే అవకాశం ఉంది. 2020 స్వచ్ఛ సర్వేక్షణ్‌లో నగర స్వచ్ఛతపై ప్రజాభిప్రాయ సేకరణకే అత్యంత ప్రాధాన్యతను స్వచ్ఛ భారత్ మిషన్ ఇచ్చింది.
స్వచ్ఛ సర్వేక్షణ్ 2020లో అడిగే ప్రశ్నలు ఇవే…
1. మీ ఇంటి నుండి ప్రతిరోజు చెత్తను సేకరిస్తున్నారా…?
2. చెత్తను తడి, పొడి చెత్తగా విడదీసి ఇవ్వాలని గార్బేజ్ కలెక్టర్ మిమ్మల్ని అడుగుతున్నారా…?
3. మీ పరిసర ప్రాంతాల్లో చేపడుతున్న పారిశుధ్య కార్యక్రమాలపై సంతృప్తి చెందుతున్నారా…?
4. మీ నగరంలో జరుగుతున్న ఫంక్షన్లు, ఇతర ఉత్సవాల సందర్భంగా మంచినీరు, జ్యూస్‌ల వినియోగానికి ప్లాస్టిక్ బాటిళ్లు, గ్లాసులు, ప్లాస్టిక్ కవర్లను అతితక్కువగా వాడే అంశాన్ని గమనిస్తున్నారా…?
5. మీ నగరంలో ఫుడ్ బ్యాంక్, క్రాకరి బ్యాంక్ ల ద్వారా ఆహారాన్ని వృథా కాకుండా చేయడం, వ్యర్థ వస్తువులను రీసైక్లింగ్ చేయాలని కోరుతూ చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు గమనించారా…?
6. భవన నిర్మాణ వ్యర్థాలు మీ ఇంటి సమీపంలో, రహదారిలో రెండు, మూడు రోజులకు పైగా ఉన్నట్టు గమనిస్తున్నారా…?
7. మీ నగరం/ కాలనీలో కంపోస్ట్ ఎరువుల తయారీని ప్రోత్సహిస్తున్నారా.. మీరు హోం కంపోస్ట్‌ను చేస్తున్నారా…?
8. మీ నగరంలో పబ్లిక్ టాయిలెట్లు ఏ లొకేషన్లో ఉన్నాయి, పబ్లిక్ టాయిలెట్ సమీపంలో ఎక్కడ ఉందనే సమాచారాన్ని తెలసుకోవడానికి గూగుల్ మ్యాప్‌ను ఉపయోగిస్తున్నారా..?
9. మీ నగరంలో పాఠశాలలు, హోటళ్లు, హాస్పత్రులు, ఆర్.డబ్ల్యుఏలు, ప్రభుత్వ కార్యాలయాలకు స్వచ్ఛ ర్యాకింగ్‌లు ఇస్తున్నారే విషయం మీకు తెలుసా…?
10. స్వచ్ఛ భారత్ మిషన్‌లో మీ నగరానికి మెరుగైన స్థానం లభించే విధంగా సేవలు అందించేందుకు మీకు అవకాశం లభించిందా…ప్రైవేట్ రంగం, స్వచ్ఛంద సంస్థలు, స్వయం సహాయక సంఘాలు, స్వచ్ఛ సర్వేక్షణ్‌లో మీ నగరంలో పాల్గొంటున్నాయా..?
11. స్వచ్ఛ సర్వేక్షణ్ లీగ్-2020లో మీ నగరం పాల్గొంటున్న విషయం మీకు తెలుసా…?
12. మీ నగరంలో పబ్లిక్ టాయిలట్లు, కమ్యునిటీ టాయిలెట్ల నిర్వహణ సక్రమంగా ఉందా…?
స్వచ్ఛ సర్వేక్షణ్-2020 సర్వేలో టెలిఫోన్ ద్వారా అడిగే 12 ప్రశ్నలకు సానుకూల సమాధానాలు ఇచ్చేవిధంగా నగరవాసులను చైతన్యపర్చాలని జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిషోర్ కోరారు. నగరంలో చేపట్టిన స్వచ్ఛత కార్యక్రమాలు ముఖ్యంగా సాఫ్, షాన్‌దార్ హైదరాబాద్ కార్యక్రమంలో పెద్ద ఎత్తున స్వచ్ఛ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమాల్లో పైన సూచించిన 12 అంశాలు కూడా ఉన్నాయని పేర్కొన్నారు. వీటిపై పాఠశాలలు, కళాశాలలు, కాలనీ సంక్షేమ సంఘాలు, ప్రజాసమూహ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలను చేపట్టి, స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా వచ్చే ఫోన్ కాల్స్‌కు సానుకూల సమాధానాలు ఇచ్చేవిధంగా కృషిచేయాలని జోనల్, డిప్యూటి, మెడికల్ అధికారులకు జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిషోర్ ఆదేశాలు జారీ చేశారు.