తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతూనే ఉంది. కరోనా కేసుల సంఖ్య లక్షకు చేరువ కాగా సెంటర్ ఫర్ సెల్యూలార్ అండ్ మాలిక్యులర్ బయోలాజీ(సీసీఎంబీ) షాకింగ్ విషయాన్ని బయటపెట్టింది. ఒక్క హైదరాబాద్ నగరంలోనే 6.6 లక్షల మందికి కరోనా సోకి ఉంటుందని అంచనా వేసింది.
నగరంలో మురుగునీటిపై పరిశోధన చేసిన సీసీఎంబీ జీహెచ్‌ఎంసీ పరిధిలోని ఏడు సీవరేజీ ప్లాంట్లలో మురుగునీటిని సేకరించి పరిశీలించింది. దీని ప్రకారం దాదాపు 6.5 లక్షల మందికి కరోనా సోకి ఉండవచ్చని తెలిపింది.
కరోనా బాధితుల నాసికా ద్రవాలు, నోటిద్వారానే కాకుండా మలమూత్ర విసర్జన ద్వారా కూడా వైరస్ బహిర్గతమవుతుంది. మురుగునీటిలో చేరిన వైరస్ వల్ల వ్యాధి వ్యాపించదు. కానీ ఈ మహమ్మారి ఎంతమందికి సంక్రమించింది? తీవ్రత ఎలా ఉందనే విషయం తెలుసుకున్నామని తెలిపారు.
మురుగునీటి నుంచి సేకరించిన నమూనాలను పరిశీలించగా ప్రస్తుతం రెండు లక్షలమంది విసర్జితాల్లో వైరస్ ఉన్నట్టు అంచనావేశారు. ఇందులో ఆరుశాతం మందికి కరోనా వచ్చిపోయిన విషయం కూడా తెలియకపోవచ్చని తెలిపింది సీసీఎంబీ.
అంబర్‌పేట, నాగోల్, అత్తాపూర్, నల్లగండ్ల ప్రాంతాల్లో ట్రీట్‌మెంట్ ప్లాంట్ల వద్ద మురుగునీటి నమూనాలను సేకరించామని సీసీఎంబీ వెల్లడించింది.